కడ్తాల్, నవంబర్ 27 : గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం పేరిట బలవంతంగా తమ భూ ములను గుంజుకుంటే ఊరుకునేది లేదని భూ నిర్వాసితులు హెచ్చరించారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా కడ్తాల్ మండలంలోని ఏక్వాయిపల్లిలో భూ ములు కోల్పోతున్న నిర్వాసితులతో గురువారం పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు, కందుకూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ జయశ్రీ హాజరయ్యారు.
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.30 లక్షలు నష్ట పరిహారం లేదా ఎకరాకు రూ.25 లక్షలతోపాటు ఒక ప్లాట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. భూనిర్వాసితులు మాట్లాడుతూ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంపై రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా భూసేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. భూములు కోల్పోతు న్న రైతులకు భూమికి భూమి లేదా ఎకరాకు రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు భూములను ఇచ్చేది లేదని తేల్చిచెప్పి గ్రామసభను బహిష్కరించారు.