వికారాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు చెందిన ఓ రైతు వికారాబాద్ కలెక్టరేట్ ప్రధాన ద్వారానికి తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. బాధితుడి కథనం ప్రకారం వివరాలు ఇలా.. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోని కొడంగల్ మండలం చిట్లపల్లికి చెందిన 331 సర్వే నంబర్లో వడ్డె చంద్రమ్మ పేరిట ఉన్న 24 గుంటల పట్టా భూమిలో అటవీ శాఖ ఫెన్సింగ్ వేసింది. ఫెన్సింగ్ తొలగించాలని కుటుంబ సభ్యులు 30ఏళ్లుగా తిరుగుతున్నారు. సర్వే నంబర్లో మొత్తం 9ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది.
అటవీ శాఖ కంచె వేసి హద్దు రాళ్లు వేసి నిషేధిత జాబితాలో చేర్చారు. పట్టా భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంతో సదరు కుటుంబ సభ్యులు అటవీ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బాధితుడు శ్రీనివాస్ గురువారం వికారాబాద్ కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఆర్చ్‌కు తన వెంట తెచ్చుకున్న తాడుతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే కలెక్టరేట్లో డ్యూటీలో ఉన్న హోంగార్డు అప్రమత్తమై తాడును లాగేసి బాధితుడిని కిందికి దింపారు. కలెక్టర్‌కు ఏడాదిన్నరగా 11సార్లు కలిసి వినతిపత్రం అందజేసినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదని బాధితుడు వాపోయాడు.
మా పట్టా భూమిలో అటవీ శాఖ అధికారులు ఫెన్సింగ్ వేసి నిషేధిత జాబితా లో పెట్టారు. దీనిపై ఏడాదిన్నరలో వికారాబాద్ కలెక్టర్‌కు 11సార్లు వచ్చిన. ఒకసారి ధర్నా కూడా చేసిన. కలెక్టర్‌ను కలి స్తే నేను సంబంధిత అధికారికి చెప్పినా చేస్తలేరని కలెక్టర్ అంటున్నరు.సర్వే పూర్తి చేసి పట్టా భూమి అని తేల్చిన తర్వాత కూడా కొడంగల్ ఎఫ్ఆర్వో చుట్టూ, డీఎఫ్‌వో చుట్టూ తిరిగినా పరిష్కారం లభిస్తలేదు.
– శ్రీనివాస్, రైతు, చిట్లపల్లి గ్రామం, కొడంగల్ మండలం