హనుమకొండ చౌరస్తా, నవంబర్ 8: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో సంకటహర చతుర్థి నిత్యాన్నిహిక కార్యక్రమాలు నిర్వర్తించారు. ప్రముఖ శివభక్తుడు సతీష్‌కుమార్ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో వేయ్యిమంది భక్తులకు కార్తీక సమారాదన దేవతా వృక్షాల దగ్గర మారేడు, జమ్మి, ఉసిరిక, రావి చెట్ల దగ్గర భక్తులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కార్తిక దామోదరః అంటూ అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
సాయంకాలం ఉత్తిష్ఠిగణపతికి పంచామృతాలతో, నవరసాలతో గణపతి అభిషేకం నిర్వర్తించి, గరికపూజ, పుష్పార్చన నీరాజన మంత్రపుష్పం అనంతరం ఆలయ నాట్య మంటపంలో 11 మంది వేదపండితుల ఆధ్వర్యంలో ‘మహాలింగార్చన’ పుట్టమట్టితో తయారు చేసిన 1000 శివలింగాలకు చెరుకు రసం, నెయ్యి, తేనే, చక్కెర, బిల్వఫలాలు, కొబ్బరినీళ్లు, నవరత్నజలం, పసుపునీళ్లు, నువ్వులనూనె, పుష్పోదక జలం, బిల్వజలం, రుద్రాక్ష ఉదకం, గరికవట్టివేరు, కస్తూరి పరిమిళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వర్తించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో మహిళలందరూ దీపాలు వెలిగించుకున్నారు. వైదిక కార్యక్రమాల ఆలయ వేదపండితులు గంగు మణికంఠశర్మ, ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, వేద పండితులు జ్యోతిభరత్శర్మ, ప్రసాద్‌శర్మ, రిషిశర్మ, అశ్రిత్శర్మ, కృష్ణశర్మ, ప్రద్యూమ్నశర్మ నిర్వహించారు. ఆలయ ఉద్యోగులు ఎన్.మధుకర్, రామకృష్ణ, రజిత భక్తులకు సేవలందించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డి.అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.