సుబేదారి, ఫిబ్రవరి 24 : హనుమకొండ కొత్తూరుకు చెందిన రౌడీషీటర్, కాంగ్రెస్ పార్టీ 5వ డివిజన్ కార్పొరేటర్ పోతుల శ్రీమాన్‌ను మంగళవారం హైదరాబాద్ సరూర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీల విషయం లో సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గౌతమ్నగర్కు చెందిన చీదర శ్రీనివాస్ ఇంట్లోకి గత ఏడాది మే 22న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు ధరించి చొరబడి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసిన సరూర్‌నగర్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి విచారణ చేపట్టారు.
శ్రీనివాస్‌పై దాడి చేయించింది కార్పొరేటర్ శ్రీమాన్‌గా పోలీసుల విచారణలో తేలింది. బాధితుడు శ్రీనివాస్, శ్రీమన్కు మధ్య రూ.35 లక్షల ఆర్థిక లావాదేవీల కారణంగా గొడవలున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు శ్రీనివాస్ మెడికల్ రిపోర్టు ఆధారంగా సరూర్‌నగర్ పోలీసులు శ్రీమాన్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరు నెలలుగా కార్పొరేటర్ శ్రీమాన్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతుండగా మంగళవారం సరూర్‌నగర్ పోలీసులు హనుమకొండ కొత్తూరులోని శ్రీమాన్ ఇంటికి వచ్చి అరెస్టు చేశారు. అతడిని చర్లపల్లి జైలుకు తరలించినట్లు తెలిసింది. శ్రీమాన్‌పై హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీట్ ఉన్నట్లు ఇక్కడి పోలీసులు తెలిపారు.