హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్ఠను దిగజార్చేందుకు మహాటీవీతోపాటు కొన్ని డిజిటల్ చానెళ్లు కిరాయి గూండాల్లాగా పనిచేస్తున్నాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌పై కట్టుకథలు అల్లి వాటికి అశ్లీల చిత్రాలు జోడిస్తూ సంచలన రీతిలో అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
వీటన్నింటినీ తెలంగాణ పోలీసులు మౌన ప్రేక్షకుల్లాగా చూస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌లపై విచారణ చేస్తున్న సిట్ ఓ దర్యాప్తు సంస్థలాగా కాకుండా ఓ రాజకీయ పరికరంలాగా పనిచేస్తున్నదని దుయ్యబట్టారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న మీడియా సంస్థలపై వెంటనే ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.