హైదరాబాద్: యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దివ్య విమాన స్వర్ణగోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 11:54 గంటలకు వానమామలై మఠం 31వ పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్ పర్యవేక్షణలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ నిర్వహిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా దివ్య విమాన స్వర్ణ గోపురాన్ని ఆవిష్కరించి స్వామివారికి అంకితమివ్వనున్నారు. దీంతో బంగారు గోపురం భక్తులకు దర్శనమివ్వనుంది. దివ్యవిమాన స్వర్ణతాపడం కోసం రూ.80 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. మహాక్రతువును తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
పలు దర్శనాలు నిలిపివేత
మహాకుంభాభిషేక సంప్రోక్షణలో భాగంగా ఆదివారం ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. స్వామివారి నిత్య తిరుకల్యాణోత్సవం, సువర్ణ పుష్పార్చన. ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఉదయం 9నుంచి కొండపైకి ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. భక్తుల కోసం కొండపైకి 25 ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా పటిష్ట చర్యలు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.