ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం సహజం. కానీ తొలిసారిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి కనుమరుగైంది. బీఆర్ఎస్ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటంకాలు సృష్టించడమే కాకుండా ఆడబిడ్డ అని కూడా చూడకుండా అవమానిస్తున్నది. చివరికి ఆమె కన్నీటిని కూడా రాజకీయానికి వాడుకొని మహిళల ఆగ్రహానికి గురైంది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఓవైపు ఆడబిడ్డ. భర్తను కోల్పోయి నెలలు కూడా గడవకముందే, ప్రజలు ఆయనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేసేందుకు రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్తను గెలిపించిన ఓటర్లు ఇప్పుడు ఆయన ఆశయాలను నెరవేర్చే బాధ్యతను తనకు అప్పగిస్తారనే నమ్మకంతో ప్రచారం చేస్తున్నది. మరోవైపు ఒక రౌడీషీటర్ బిడ్డ. ప్రత్యర్థి మరణాన్ని ‘దైవనిర్ణయం’ అంటూ హేలన చేసే స్థాయికి దిగజారారు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా అడుగడుగునా అవమానాలు చేస్తున్న మంత్రుల బృందం ఆయనకు మద్దతు పలుకుతున్నది. అక్కడితో ఆగకుండా మరణించిన వ్యక్తిపై బురద చల్లడం, అడ్డగోలు కారణాలు చూపి నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా విశ్వ ప్రయత్నాలు చేయడం, తల్లికి అండగా ఉంటున్న ఆడపిల్లలపై కేసులు మోపడం.. వంటి అధికారపార్టీ అమానవీయ రాజకీయ ఎత్తుగడలు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనిపిస్తున్న దృశ్యం ఇది. ఎన్నికల రాజకీయం కోసం పార్టీలు ఇంతలా అడ్డదారులు తొక్కాలా? ఓ రెండు ఓట్లు సాధించేందుకు ఆడబిడ్డ అని చూడకుండా అమానవీయంగా ప్రవర్తించాలా? ప్రత్యర్థి వ్యక్తిగత జీవితంలోకి చొరబడి, చివరకు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే స్థాయికి దిగజారాలా? అని జూబ్లీహిల్స్ (Jubilee Hills Bypoll) ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. ప్రజాతీర్పుపై నమ్మకం కోల్పోయినపుడే ఇలాంటి దిగజారుడుతనం ప్రదర్శిస్తారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ పార్టీల మధ్య సమరంలా లేదని.. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ ఆడబిడ్డకు, అధికారంలో ఉండి కూడా రౌడీషీటర్ బిడ్డకు టికెట్ ఇచ్చిన అధికార కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ అన్నట్టుగా తయారైందని అంటున్నారు.
బ్యాలెట్ పోరులో రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటాయి. అధికారంలో ఉన్న పార్టీ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని వివరించి ఓట్లడుగుతుంది. ప్రతిపక్షం అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలోనైనా తెలంగాణ ఏర్పడిన తర్వాతనైనా వచ్చిన అనేక సాధారణ, ఉపఎన్నికల్లో తెలంగాణ సమాజం ఇదే చూసింది. కానీ తొలిసారిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి కనుమరుగయ్యిందనే ఆవేదన సర్వత్రా వినిపిస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు అడుగడుగునా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తున్నది, అవమానిస్తున్నది. ఇటీవల రహమత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో బీఆర్ఎస్ ప్రచార సభ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసానితోపాటు అనేకమంది బీఆర్ఎస్ ముఖ్యనేతలు, పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు తరలివచ్చారు. మాగంటి గోపీనాథ్ ఉన్నంతవరకు ఆయన సతీమణి సునీత పెద్దగా ప్రజాక్షేత్రంలోకి రాలేదు. తొలిసారే ఇంత పెద్ద సభలో పాల్గొనడం, పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానుల్ని చూసి ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. భర్తను తలచుకొని పెట్టిన ఆ కన్నీటిని కాంగ్రెస్ మంత్రులు అపహాస్యం చేశారు. సునీతది కృత్రిమ ఏడుపు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అవమానించారు. ‘ఈ ఏడుపుల ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్‌గా నువ్వు ఏడవాల్సిందేనని వీళ్లు చెప్తున్నట్టున్నది. అంతర్గతంగా కొందరు కార్యకర్తలు అమ్మా నువ్వు వేదికలపై ఏడవాల్సిందేనని చెప్తున్నరు. కృత్రిమ ఏడుపు ఎప్పుడూ మంచిది కాదు. రాజకీయాలు వేరు, సానుభూతి వేరు. రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నరు. ఒకరు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఒకరు ఓదార్చుతుంటే.. ఈ డ్రామా అంతా సినిమాలో చూసినట్టు అనిపిస్తున్నది’ అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆడబిడ్డ కన్నీళ్లను వాడుకొని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నదంటూ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తన స్థాయిని మరిచి మాట్లాడారు. ‘ఆడబిడ్డ కన్నీళ్లనూ వాళ్లు వదిలిపెట్టేలా లేరు. వాటి ద్వారా మళ్లీ అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు’ అని దిగజారు డు వ్యాఖ్యలు చేశారు. మంత్రుల వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం నుంచి పెద్దఎత్తున ఆ గ్రహం వ్యక్తమైంది. ఓ ఆడ బిడ్డ కన్నీరు కారిస్తే సానుభూతి చూ పాల్సిందిపోయి రాజకీయం కోసం ఇంతలా అవమానిస్తారా? అంటూ మహిళాలోకం భగ్గుమన్నది.
మాగంటి సునీతాగోపీనాథ్ కన్నీటిని అవమానించడంతో అధికార పార్టీ ఆగలేదు. అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ, ఆమెపై బురద చల్లేందుకు యత్నించింది. మాగంటి గోపీనాథ్‌కు సునీత భార్య కాదంటూ దేశంలోనే లేని ఓ వ్యక్తి పేరుతో లేఖను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. గోపీనాథ్ వారసుడిని తానేనంటూ దేశంలోనే లేని ఓ వ్యక్తి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని, సునీతా గోపీనాథ్ నామినేషన్‌ను తిరస్కరించాల్సిందిగా కోరారని దుష్ప్రచారం చేసింది. దాదాపు రెండురోజులు ఆ లేఖను వైరల్ చేసినా కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితం రాలేదు. చివరకి ప్రభుత్వ అనుకూల పత్రికల్లో ఈ అంశంపై కథనాలు వండి వార్చేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నించినా, ప్రజల్లో చులకన అవుతామనే భయంతో సదరు పత్రికలు ముందుకు రాలేదన్న ప్రచారం జరుగుతున్నది. దీంతో కొందరు కాంగ్రెస్ నేతలు ఈ లేఖను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకుపోయి దీనినో పెద్ద వ్యవహారంగా చిత్రీకరించేందుకు చూశారు. కానీ వ్యక్తిగత విషయాలతో నామినేషన్ల ప్రక్రియకు సంబంధంలేదని ఎన్నికల అధికారులు తేల్చి చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. ఈ ప్రయత్నమూ బెడిసికొట్టడంతో కాంగ్రె స్ అభ్యర్థి నవీన్‌యాదవ్ రంగంలోకి దిగారు. నామినేషన్ల పరిశీలన సమయంలో కుటుంబ ఆస్తులకు సంబంధించి అభ్యంతరాలను వ్యక్తం చేసి, నామినేషన్ తిరస్కరించాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఆ పాచిక కూడా పారలేదు.
కాంగ్రెస్ చివరికి అధికార దుర్వినియోగంతోపాటు పరోక్ష బెదిరింపులకూ పాల్పడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిరోజుల కిందట మాగంటి సునీతా గోపీనాథ్, ఆమె కుమార్తె అక్షర ఓ ప్రార్థనా మందిరానికి 100 మీటర్ల కంటే ఎక్కువ దూరంలోనే కొందరు పలకరిస్తే వారితో మాట కలిపారు. దీంతో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా 100 మీటర్లలోపు ప్రచారం చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సునీతా గోపీనాథ్‌తోపాటు అక్షర మీద కేసు నమోదు చేశారు. దీంతో ఆడబిడ్డలను వేధించేందుకు కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుందనే సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ నామినేషన్ వేసేరోజు ఓ ప్రార్థనా మందిరంలో నుంచి బయటికొచ్చిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆయ న అనుచరుల్ని ఆ ప్రార్థనా మందిరం ముందే కలిసినా అక్కడే ఉన్న పోలీసులకు అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని మాత్రం తోయలేదు. ఇదే కాదు మాగంటి బిడ్డలు ప్రచారం చేస్తున్నపుడు అడుగడుగునా పోలీసులు అవరోధం సృష్టిస్తున్నారు. వెంట ఎక్కువమంది ఉన్నారంటూ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు.
మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందుగానే నియోజకవర్గంపై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గాన్ని నమ్ముకొని ఉన్న మైనార్టీ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దిన్కే టికెట్ ఇస్తారని అందరూ భావించారు. సీఎం వర్గం ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి పక్కకు తప్పించగా, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ వంటి సీనియర్ నేతలకు అవకాశం కల్పిస్తారని పార్టీ శ్రేణులు ఆశించినా నెరవేరలేదు. చివరికి రౌడీ షీటర్ బిడ్డను రంగంలోకి దింపింది. సాక్షాత్తు కాంగ్రెస్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా రౌడీషీటర్ అని అభివర్ణించిన చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబంలోని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో సాధారణ ఓటరు మొదలు కాంగ్రెస్ నేతలు సైతం నివ్వెరపోయారు. అయినా రాష్ట్ర కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోలేదు. రౌడీషీటర్‌గా పోలీస్‌స్టేషన్‌లో ఫొటో అతికించిన శ్రీశైలంయాదవ్తో ఏకంగా మంత్రి సీతక్క, ఇతర కాంగ్రెస్ నేతలు కలిసి ప్రచారం చేయడంపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఓటర్లను భయాందోళనలకు గురి చేయడమే అనే ఆరోపణలు ఉన్నాయి.