మడమ తిప్పడం.. మాట తప్పడం సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర అని మాజీ స్పీకర్ మధుసూదనచారి విమర్శించారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని .. బిహార్లో రాహుల్ గాంధీ ప్రచారం చేసుకున్నారని తెలిపారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బండ ప్రకాశ్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి మధుసూదనచారి మీడియాతో మాట్లాడారు. బీసీలకు హామీలు ఇవ్వడంతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మధుసూదనచారి తెలిపారు. హామీలు అమలు చేయనందుకు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏటా బీసీల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు పెడతామని అన్నారని గుర్తుచేశారు. కానీ హామీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికి బీసీలు చరమగీతం పాడతారని హెచ్చరించారు.
జీవో నంబర్ 46తో బీసీల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లిందని బండ ప్రకాశ్ విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వ చర్యలు ప్రహసనంగా మారిందని అన్నారు. ఆర్టికల్ 340 కింద డెడికేటెడ్ కమిషన్ వేయాలని కోరామని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన కమిషన్కు రాష్ట్రపతి ఆమోదం కూడా ఉంటుందని చెప్పామని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సూచన పట్టించుకోలేదని మండిపడ్డారు. రెండు ప్రధాన పార్టీలు సంపూర్ణంగా సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు.