కవాడిగూడ, సెప్టెంబర్ 11: దేశంలో బీసీలకు నిజమైన స్వాతంత్య్రం రాలేదని, బీసీల ఓట్లతో గద్దెనెక్కి అధికారం చెలాయిస్తున్న ప్రభుత్వాలు బీసీలను మనుషులుగా కూడా గుర్తించకపోవడం అత్యంత బాధాకరమని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని, ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్ అధ్యక్షతన ఇందిరాపార్కు వద్ద శుక్రవారం బీసీల ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలంతా ఒక్కతాటిపైకి వచ్చి పాలకపక్షాల మెడలు వంచాలని అన్నారు.
బీసీ కులాల లెక్కలు తీసేంతవరకు తెలంగాణ ఉద్యమం తరహాలో పెద్దఎత్తున పోరాటం సాగించాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీలకు ఎలాంటి ప్రయోజనం లేని జనగణనను తక్షణమే నిలిపివేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. 40 ప్రశ్నలతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను రద్దుచేసి, జాతీయస్థాయిలో అఖిలపక్ష పార్టీలు, సామాజిక నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతే జనగణన ప్రారంభించాలని అన్నారు. కులగణన చేపట్టని బీజేపీ నాయకులకు బీసీలంతా కలసి పిండప్రదానం చేస్తామని హెచ్చరించారు. బీసీ కులగణనపై ఈ నెల 20న హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని, దేశవ్యాప్తంగా మరో మండల్ ఉద్యమానికి రూపకల్పన చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ‘56 శాతం బీసీలు.. రాజకీయ న్యాయం ఎకడ? అనే అంశంపై శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్‌గౌడ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
శాసనసభ, మంత్రివర్గం, లోక్‌సభ, రాజ్యసభ, ఎమ్మెల్సీలు, కీలక రాజకీయ నిర్ణయాధికార వ్యవస్థల్లో బీసీల ప్రాతినిధ్యం అత్యల్పంగా ఉందని వివరించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 3 మంత్రి పదవులను బీసీలకు కేటాయించాలని, ఎమ్మెల్సీ స్థానాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఆయా అంశాలను ఈ సమావేశంలో చర్చకు పెట్టనున్నామని వివరించారు.