హైదరాబాద్: ప్రజల తరపున ప్రశ్నిస్తున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని మండలిలో బీఆర్ఎస్ పార్టీ పక్ష నేత మధుసూధనా చారి (Madhusudhana Chary) విమర్శించారు. కౌశిక్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఆయనపై ఎన్నో అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే శని, ఆదివారాలు కోర్టుకు సెలువు రోజులని చూసి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిందన్నారు. రెండు రోజులైనా జైల్లో పెట్టాలని కుట్ర చేశారని విమర్శించారు. అక్రమ కేసులను న్యాయ పోరాటం ద్వారా ఎదుర్కొంటామని చెప్పారు.
కోర్టుల్లో వరస ఎదురు దెబ్బలు తగిలినా నవ్విపోదురు గాక నాకేమిటీ సిగ్గు అనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. హామీల అమలు చేతకాక అక్రమ అరెస్టులకు దిగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కృష్ణుడు కూడా శిశుపాలుడి వంద తప్పులను భరించారని, వరసగా తప్పులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పనిసరిగా ప్రజల చేతిలో శిక్ష తప్పదన్నారు. కౌశిక్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Live: ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి వర్థంతి కార్యక్రమం.
📍తెలంగాణ భవన్ https://t.co/nTmmV9llZb
— BRS Party (@BRSparty) June 21, 2025