హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : దేశంలో సామాజిక న్యాయానికి సమాధి కట్టిందే అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి విమర్శించారు. సామాజిక న్యాయం అనే పదాన్ని ఉచ్ఛరించే అర్హత కూడా ఆ పార్టీకి లేదని మండిపడ్డారు. 1970, 1980 ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వంలో సగం మంది మంత్రులు, సీఎంలు, గవర్నర్లు కూడా కాంగ్రెస్‌లో ఒకే సామాజికవర్గం వారు ఉండేవారని ధ్వజమెత్తారు. దేశంలో బీసీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చిందే హస్తం పార్టీ అని మండిపడ్డారు. ఇప్పటికీ రాష్ట్ర మంత్రివర్గంలో, కార్పొరేషన్ల చైర్మన్లుగా ఒకే సామాజికవర్గం వ్యక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ఇప్పుడు సామాజిక న్యాయంపై ఖర్గేతో చిలక పలుకులు పలికించడం చూస్తే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని మండిపడ్డారు.
తెలంగాణభవన్‌లో శుక్రవారం రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్, ఆంజనేయగౌడ్, రామచంద్రునాయక్ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్రాచారితో కలిసి మధుసూదనాచారి మీడియాతో మాట్లాడారు. దేశంలో మెజారిటీ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ ఏనాడూ గౌరవించలేదని స్పష్టంచేశారు. ఎల్బీ స్టేడియం సభలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో తెలంగాణలో అద్భుతమైన పాలన జరిగిందని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు.
తాను ప్రకటించిన డిక్లరేషన్ అమలు కాకున్నా కాంగ్రెస్ పాలన అద్భుతమని ఖర్గే ఎలా అంటారు? అని మధుసూదనాచారి ప్రశ్నించారు. మండల్ కమిషన్‌ను తొకి పెట్టి, మెజారిటీ ప్రజలకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, ఖర్గే మాటలు దొంగే దొంగా.. దొంగా అన్నట్టుగా ఉన్నదని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన కులగణనపై ఖర్గే గొప్పలు చెప్పుకొంటున్నారని, తూతూ మంత్రంగా, తప్పుల తడకగా కులగణన జరిగిందని, బీసీ బిల్లును ఆమోదించి ఢిల్లీకి పంపిన తర్వాత కూడా ఎలాంటి పురోగతి లేదని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
ఎన్నికల సమయంలో రాష్ర్టానికి వచ్చి రైతులకు, నిరుద్యోగులకు, యువతకు, మహిళలకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఖర్గే అనేక హామీలిచ్చారని, అవి అమలయ్యాయా? లేదా? అన్న వాస్తవాలను ఓ సారి క్రాస్‌చెక్ చేసుకోవాలని ఖర్గేకు హితవు పలికారు. ప్రజలను మోసం చేయడంలో తెలంగాణను ఓ ప్రయోగశాలగా మార్చారని, హామీలు అమలవుతున్నాయని ఖర్గే చెప్పడం ప్రజలను వంచించడమేని ధ్వజమెత్తారు. మళ్లీ బీసీలను మోసగించాలని చూస్తున్నదని, కాంగ్రెస్ న యా నాటకాన్ని ప్రజలకు వివరించి ప్రజాక్షేత్రంలో ఎండగతామని హెచ్చరించారు.