హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలు అమలు కాకుండా పేరుకుపోగా, దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేక, దృష్టిని మళ్లించడానికే రేవంత్ పెట్టుబడులు తెచ్చామంటూ చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బుధవారం మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, చిరుమర్తి లింగయ్య, మెతుకు ఆనంద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో కుదిరిన రూ.40 వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాల్లో రూ.10 వేల కోట్లు కూడా రాష్ట్రానికి రాలేదని గుర్తుచేశారు. దేశంలో తానే గొప్ప పనులు చేస్తున్న సీఎంగా రేవంత్ చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవాచేశారు. దావోస్ ఎంవోయూలు టూర్ నెట్వరింగ్కు మాత్రమే ఉపయోగపడతాయని ఏపీ సీఎం చంద్రబాబే చెప్పారని గుర్తుచేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఎంవోయూలను ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గానే చూస్తామని, ఓపెన్ టెండర్లను ఆహ్వానిస్తామని చెప్పారని పేర్కొన్నారు. మేఘా వంటి చాలా సంస్థలు హైదరాబాద్‌కు చెందినవేనని, హైప్ సృష్టించడానికి, లెక్కలు ఘనంగా చెప్పుకోవడానికి దావోస్‌లో ఎంవోయూలు చేసుకున్నారని మండిపడ్డారు. 13 నెలల పాలనలో రేవంత్‌రెడ్డి ఏం సాధించారని నిలదీశారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలో సుస్థిరపాలన కొనసాగిందని, ఐటీ అభివృద్ధికి కేటీఆర్ ఇతోధికంగా పనిచేశారని గుర్తుచేశారు. అలాంటివారిపై అసహనంతోనే రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏడీసీతో బాధపడుతున్న రేవంత్
సీఎం రేవంత్‌రెడ్డి అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ (ఏడీసీ)తో బాధపడుతున్నారని మధుసూదనాచారి తెలిపారు. సింగపూర్‌ను రాష్ట్రం అని, అమెజాన్ వెబ్‌సిరీస్ అని, టీబీ వ్యాధిని లెప్రసీగా చెప్తున్నారని తెలిపారు. అవగాహన లేని సీఎం దేశంలో మరొకరు లేరని పేర్కొన్నారు. అనుభవరాహిత్యంలో రేవంత్‌కు ఆయనే సాటి అని విమర్శించారు. రేవంత్ హామీలపై పలాయనవాద వైఖరి అవలంబిస్తున్నారని, కేసీఆర్ సుస్థిరపాలన అందిస్తే రేవంత్ రాష్ట్రంలో అస్థిరపాలన తెచ్చారని మండిపడ్డారు. కేసీఆర్ కట్టిన అంత పెద్ద సచివాలయం ఉండగా, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీఎస్) నుంచి సీఎం రేవంత్ ఎందుకు సమీక్షలు చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీస్ పాలన, మాఫియా పాలన తెచ్చేందుకే తరచూ సీసీఎస్‌కు వెళ్తున్నారా? అని నిలదీశారు. తప్పుడు కేసులు బనాయిస్తే సహింబోమని హెచ్చరించారు.
అనంతగిరి అడవులను మేఘాకు ఇచ్చే కుట్ర: ఆనంద్
అనంతగిరి అడవులను మేఘా సంస్థకు రూ.1,000 కోట్లకు ధారాదత్తం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విమర్శంచారు. దీనిపై త్వరలోనే వికారాబాద్ నుంచే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి వికారాబాద్ రోడ్డు అధ్వానంగా ఉన్నదని, వీటి మరమ్మతులకు నిధులు లేవని, మూసీ అభివృద్ధికి లక్షన్నర కోట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు పెడితే బీసీలు కాంగ్రెస్ నాయకులను గ్రామాలకు రానివ్వొద్దని పిలుపునిచ్చారు.
కుంభమేళా మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
యూపీ కుంభమేళా తొకిసలాటలో మరణించిన భక్తుల కుటుంబాలను కేంద్రం, యూపీ ప్రభుత్వాలు ఆదుకోవాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సానుభూతిని వ్యక్తంచేశారు.