మధిర, మే 27: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలో మరో భూ దందా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి తక్కు వ ధర కలిగిన భూమి రూ.6 కోట్లకు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని స్కెచ్ వేయగా, డెవలప్మెంట్ కమిటీ సభ్యుల పరిశీలనతో బట్టబయలైంది. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో రూ.129 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీని భట్టి విక్రమార్క మంజూరు చేయించగా, పనులు జరుగుతున్నాయి. మధిరలో జరిగే అభివృద్ధి పను ల పర్యవేక్షణకు డిప్యూటీ సీఎం ‘డెవలప్మెంట్ కమిటీ’ని ఏర్పాటు చేశారు.
ఇందులో కాం గ్రెస్‌తో పాటు సీపీఐ, టీడీపీ నాయకులకు కూడా చోటు కల్పించారు. వీరు బుధవారం ఇల్లెందులపాడులో మురుగునీటి శుద్ధి ప్లాంట్(ఎస్టీపీ) నిర్మాణానికి ఎకరం రూ. 6 కోట్లతో ప్రతిపాదించిన చీకటివాగు సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. ఆ సమయంలో అతి సమీపంలోనే ఉన్న మరో రైతు తన భూమిని ఎకరం రూ.కోటిన్నరకే ప్రభుత్వానికి ఇస్తానని ముందుకురావడంతో కమిటీ సభ్యులు ఖంగుతిన్నారు. అనుమానం వచ్చి ఆరా తీశారు. తక్కు వ ధర కలిగిన భూమిని ప్రభుత్వానికి కట్టబెట్టి రూ.కోట్లు కొల్లగొట్టాలన్న ప్లాన్‌ను భట్టి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆయన కూడా సీరియస్ అయినట్టు సమాచారం. దీంతో ఇందులో ప్రమేయమున్న సదరు నాయకులు తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది.