Telangana | మంచిర్యాల, నవంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండె. గాయన ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు రైతుబంధు ఇచ్చిండు. గా డబ్బులతోని మందు బస్తాలు కొనుక్కునేటోళ్లం. కూలీల ఖర్చులకు అక్కరకు వచ్చేవి. కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి ఏం లేకుండా పోయినయి. గిప్పటి వరకు రైతుబంధు (రైతు భరోసా) ఇయ్యలె. మేం కొనుగోలు కేంద్రానికి వచ్చి పది రోజులైతంది. కనీసం వడ్లు కొనేటోళ్లు లేరు. తాలు పేరుతో ఇబ్బందులు పెడుతున్నరు. ఇక్కడ సుతీల్ లేదు, పరదలు లేవు. అన్నీ రైతులే భరించుడైతంది. పరదలు మేమే తెచ్చుకోవాలి. సుతీల్ మేమే తెచ్చుకోవాలి. హమాలీలకు పైసలు మేమే ఇచ్చుకోవాలి. మళ్లా ఈ సంవత్సరం గా సుతీల్ను రంగులో ముంచి ఇయ్యాలంటున్నరు. మరి వాళ్లు ఏ రంగు పెడ్తరో మాకు తెల్వదు. సుతీల్ తేపో అనంగనే మేము కొనుక్కొని వచ్చుడైతంది. రంగులో ముంచుడెప్పుడు.. ఇగ వాళ్లు జోకుడెప్పుడు. ప్రతి కల్లం దగ్గర రైతుల పరిస్థితి గిదే. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు ఏర్పడలే. కాంగ్రెస్ వస్తే ఏమో చేస్తది అనుకున్నం.
కానీ ఇట్లున్నది కాంగ్రెస్ పని తీరు’ అంటూ రైతులు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ సాక్షిగా కాంగ్రెస్‌పై కోపాన్ని వ్యక్తం చేస్తూనే కేసీఆర్‌పై ప్రేమను చాటుకున్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం పడ్తన్‌పల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెరబెల్లి రఘునాథ్ సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ధాన్యం అమ్మకానికి తెచ్చి పది రోజులవుతున్నా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయలేదని వాపోయారు. తాలు పేరిట ధాన్యంలో కోతలు పెడుతూ తమ కష్టాన్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ నేత వెరబెల్లి రఘునాథ్ రైతులతో మాట్లాడుతూ.. కేసీఆర్ రైతుబంధు ఇచ్చారు అనగానే.. ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందంటూ రైతులకు చెప్పుకొచ్చారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.