వరంగల్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కుంభమేళానే కాదు.. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న అయోధ్యనే దేవాలయం కాదు.. తెలంగాణలోని ములుగు అడవుల్లో ఉన్న మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయం కూడా గొప్ప దేవాలయం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పౌరుషానికి మారుపేరు గా రాచరికం మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన గొప్ప చరిత్ర మేడారం సమ్మక్క, సారలమ్మదని చెప్పారు. మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపునివ్వడమే కా కుండా అభివృద్ధికి కుంభమేళాకు ఇచ్చినట్టుగానే కోట్లాది రూపాయల నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేడారం పండుగకు నిధు లు, జాతీయ హోదా ఇవ్వకపోతే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇష్టమని, వారిని సమ్మక్క-సారలమ్మలు గమనిస్తారని స్పష్టంచేశారు. మంగళవారం మేడారంలో సమ్మక్క, సారలమ్మను దర్శించుకొని వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతర నేపథ్యంలో గద్దెలు, ప్రాంగణం పునర్నిర్మాణ పనులపై పూజారు లు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. చేపట్టనున్న పనులకు శంకుస్థాపన అనంతరం సభలో ప్రసంగించారు. మేడారం అభివృద్ధికి ఎన్ని కోట్లయినా మం జూరు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్నా అవసరమైతే ఏదైనా తగ్గించుకొని మేడారం అభివృద్ధికి ఖర్చు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, సురేఖ, పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు.