LRS | హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిధుల వేటలో భాగంగా ఎల్ఆర్ఎస్పై దృష్టిపెట్టింది. ప్రజల నుంచి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేసి ఖజానా నింపాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఇందుకోసం మున్సిపల్ కమిషనర్లపై ఒత్తిడి పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలాఖరు నాటికి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్నీ పరిష్కరించాలని వారికి ప్రభు త్వం నుంచి ఆదేశాలు అందాయి. అభివృద్ధి పనులు సైతం పక్కనపెట్టి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేయడంపై దృష్టిపెట్టాలని స్పష్టం చేశారని సమాచారం. ఈ మేరకు రోజూ సాయంత్రం నివేదికలు అందించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (సీడీఎంఏ) నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిసింది.
ప్రత్యేక సిబ్బందిని నియమించారని, వారు రోజూ మున్సిపల్ కమిషనర్లకు ఫోన్లు చేసి ఫాలోఅప్ చేస్తున్నారని సమాచారం. అనుకున్న మేరకు లక్ష్యం పూర్తి చేయాలని తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం దాదాపు 25 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, హెచ్ఎండీఏలో 3.58 లక్షలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 1.35 లక్షలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 13.68 లక్షలు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పంచాయతీల పరిధిలో 6 లక్షల వరకు దరఖాస్తులు ఉన్నట్టు చెప్తున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు, ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ, వాటి వెరిఫికేషన్, కులగణన, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, రేషన్‌కార్డుల సర్వే.. ఇలా మున్సిపల్ సిబ్బంది పని ఒత్తిడితో సతమతమవుతున్నారని వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతున్నదని అంటున్నారు.
ఇలాంటి సమయంలో గడువులోగా ఎల్ఆర్ఎస్ పూర్తి చేయడం అసాధ్యమని వాపోతున్నారు. చేసేదేమీ లేక ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం పంపిస్తున్నారు. ఫోన్లు చేసి దరఖాస్తులు క్లియర్ చేసుకోవాలని కోరుతున్నారు. అయినా పెద్దగా స్పందన లేదని వాపోతున్నారు. కొందరు సహకరిస్తుండగా, మరికొందరు ‘ఉచితమని ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా? ఫీజు ఎందుకు చెల్లించాలి?’ అని ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.