హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అన్నింటా సమానత్వం అంటూ మహిళలు హక్కుల కోసం గొంతెత్తుతున్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా సత్తా చాటుతున్నారు. కొన్ని రంగాల్లోనైతే మహిళలే మహరాణులుగా విరాజిల్లుతున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఐటీ నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ సమాజంలో అసమానతలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఓ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఐటీతోపాటు 80కి పైగా రంగాల్లో మహిళా ఉద్యోగుల జీతాలు పురుషుల కంటే తక్కువగా ఉన్నట్టు ప్రముఖ జాబ్ ప్లాట్ఫాం ‘నౌకరీ’ సంస్థ సర్వేలో స్పష్టమైంది. దేశవ్యాప్తంగా 8 నగరాల్లో.. వివిధ రంగాల్లో పనిచేసే 20 వేల మంది ఉద్యోగులను నౌకరీ సంస్థ సర్వే చేసి, వివరాలను విడుదల చేసింది. మహిళా ఉద్యోగుల్లో 45శాతం మందికి పురుషుల కంటే సగటున 20 శాతం జీతం వ్యత్యాసం ఉన్నట్టు తెలిపింది.
మహిళా ఉద్యోగుల జీతాల అసమానతలో ఐటీ రంగం (56%) మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఫార్మా (55%), ఆటోమొబైల్ (53%), రియల్ఎస్టేట్ (21%), ఎఫ్ఎంసీజీ (18%), బ్యాంకింగ్(12%) రంగాలు నిలిచాయి. దేశంలోనే టెక్నాలజీ హబ్ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు మహిళా ఉద్యోగుల జీతాల్లో అసమానతలతో మొదటి, రెండు స్థానాల్లో నిలిచాయి. మహిళా ఉద్యోగుల్లో 59 శాతం అసమానతలతో హైదరాబాద్ టాప్లో నిలువగా.. 58 శాతంతో బెంగళూరు ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.
మహిళా ఉద్యోగులకు జీతాలు ఎందుకు తక్కువ ఉన్నాయనే కారణాలపైనా నౌకరి సంస్థ సర్వేలో దృష్టి పెట్టింది. ప్రసూతి సెలవులు తీసుకోవడం అసమానతలకు ప్రధాన కారణమని 51 శాతం మంది వివిధ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్ అభిప్రాయపడ్డారు. పని ప్రదేశాల్లో అసమానతలు కారణమని 27 శాతం మంది తెలిపారు. మెటర్నిటీ బ్రేక్ కారణంగా 5-10 ఏండ్ల ఉద్యోగ అనుభవమున్న మహిళా ఉద్యోగుల్లో 54 శాతం, 10-15 ఏండ్ల అనుభవమున్న మహిళా ఉద్యోగుల్లో 53 శాతం వేతనాల్లోనూ వ్యత్యాసం ఉండటం ఆందోళన కలిగిస్తున్నదని కెరీర్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వాళ్లు, 1-2 ఏండ్ల అనుభవమున్న ఉద్యోగుల జీతాలను పురుషులతో జీతాలతో పోల్చి చూస్తే 53 శాతం మందిలో ‘పే గ్యాప్స్’ ఉన్నట్టు అధ్యయనం పేర్కొంది.