హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యూరియా కొరత రైతులకు ప్రాణసంకటంగా మారింది. ఒక్క యూరియా బస్తా కోసం రైతులు తమ ప్రాణాలు కోల్పోతున్న దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. పంటలకు ప్రాణం పోయాల్సిన యూరియా.. కాంగ్రెస్ సర్కారు తీరుతో రైతుల ప్రాణాలు బలిగొంటున్నది. మరికొన్నిచోట్ల యూరియా కోసం జరిగిన తోపులాటల్లో రైతుల కాళ్లు, చేతులు విరిగిపోతున్నాయి. తలలు పగులుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, యూరియా కొరత పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతున్నది. అన్నదమ్ముల్లాంటి రైతుల మధ్య అగ్గిరాజేస్తున్నది. ఎప్పుడూ కలిసి మెలిసి ఉండే రైతులు యూరియా కోసం తన్నుకొనే పరిస్థితి ఏర్పడింది.
యూరియా కొరత కుటుంబాల్లోనూ చిచ్చు పెడుతున్నది. భార్యభర్తలు, తండ్రీ కొడుకుల మధ్య గొడవలకు కారణమవుతున్నది. ఇప్పటివరకు మీడియా సమాచారం మేరకు ఐదుగురు రైతులు యూరియా కొరత కారణంగా మరణించారు. ఈ సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని భా విస్తున్నారు. యూరియా కోసం వెళ్తూ రోడ్డు ప్ర మాదంలో మరణించిన వారు కొందరైతే.. యూ రియా పెట్టిన చిచ్చు కారణంగా తలెత్తిన గొడవల్లో మరణించిన వారు మరికొందరు. క్యూలైన్లలో నిల్చోలేక కొంతమంది రైతులు సొమ్మసిల్లి పడిపోతుంటే.. క్యూలైన్లలో జరిగిన తోపులాటల్లో మరికొందరు రైతులు గాయపడ్డారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): యూరియా కోసం వెళ్లి తొక్కిసలాటలో గాయపడ్డ గిరిజన మహిళ పాతులోతు దస్సి చనిపోయిందని, ఆమె మరణానికి కారకులెవరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లా అడవిదేవునిపల్లి గోన్యాతండాకు చెందిన ఆ మహిళా రైతును పొట్టనబెట్టుకున్న హంతకులెవరు? అని ఆదివారం ఎక్స్ వేదికగా నిలదీశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై చర్చ అసెంబ్లీదాకా పోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ, మరి ఈ గిరిజన మహిళను బలితీసుకున్నవారిపై కేసులు పెట్టరా? అని ప్రశ్నించారు. ఆమె మరణానికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.