హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆదివారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, ఆ శాఖ డైరెక్టర్ సృజనతో కలిసి జిల్లాల కలెక్టర్లతో రెండున్నగంటలపాటు సుదీర్ఘంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ఏం చేద్దాం.. ఎలా వెళ్దాం.. మీరు రెడీగా ఉన్నారా? హైకోర్టుకు ఈ నెల 30వ తేదీలోపు సమాధానం చెప్పాల్సి ఉన్నందున.. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడవచ్చు. రిజర్వేషన్ల పరిస్థితి ఏమిటి? ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టడమా? లేదా సర్పంచ్ల ఎన్నికకు పోదామా? అన్నీ ఒకేసారి పెట్టడం సాధ్యమా? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎన్నికలపై ప్రజల పల్స్ ఎలా ఉన్నది?’.. ఇలా అనేక అంశాలపై సీఎస్ అధికారులతో చర్చించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా బీసీ కమిషన్ డాటా కూడా కలెక్టర్లకు అందజేశారు. రఫ్‌గా రిజర్వేషన్లు అమలుపై కరసత్తు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. తాజాగా ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేస్తూ.. ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేవని చెప్పడం, మరోవైపు స్థానిక పోరుపై సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
గత ఫిబ్రవరిలోనూ ఎంసీఆర్‌హెచ్చార్డీలో కలెక్టర్లు, ఎంపీడీవో ఇతర అధికారులతో కూడా సమావేశాలు నిర్వహించారు. అప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతున్నది అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు లీకులు ఇచ్చారు. తీరా చూస్తే ఏమీలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని సర్వేల్లో, ఫీడ్బ్యాక్ల్లో తేలడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఈ నేపథ్యంలో కొందరు సర్పంచ్‌లు హైకోర్టును ఆశ్రయించడంతో సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు విధించిన డెడ్‌లైన్ సమీపిస్తున్న తరుణంలో ఈ సారి కనీసం షెడ్యూల్ ప్రకటించాలని చూస్తున్నట్టు తెలిసింది. అయితే, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం జీవో జారీచేయాల్సి ఉంటుంది. జీవోను సవాల్ చేస్తూ ఎవరైనా కోర్టుకు వెళ్తే న్యాయ విచారణకు అది నిలబడదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. జీవో జారీ తర్వాత రిజర్వేషన్ల కేటాయింపు, మ హిళా రిజర్వేషన్లు, రొటేషన్ మార్పు, గెజిట్ జారీకి ఎటులేదన్నా కనీసం వారం పది రోజులు పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే వార్డులవారీగా పో లింగ్ కేంద్రాలను, ఓటర్ల తుది లిస్టును తె లంగాణ ఎన్నికల కమిషన్ సిద్ధం చేసింది. రిజర్వేషన్ చిక్కుముడి వీడితే స్థానిక పోరుకు లైన్‌క్లియర్ అయినట్టేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. అయితే, క్షేత్రస్థాయి లో యూరియా అందక ప్రజలు కాంగ్రెస్ ప్ర భుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నందున ఎన్నికలకు ముందుకు వెళ్తుందా? వెనుకడుకు వేస్తుందా? అనేది తేలాల్సి ఉన్నది.