ఏటూరునాగారం, సెప్టెంబర్ 21 : ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ విద్యా విభాగంలో కీలకమైన డిప్యూటీ డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ డీడీగా పనిచేసిన పోచం పదోన్నతిపై బదిలీ కావడం, ఈ స్థానంలో మరొకరిని నియమించకపోవడంతో ఈ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో పాఠశాలల నిర్వహణపై ప్రభావం పడింది. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌లో దినసరి వేతనంపై పనిచేస్తున్న వర్కర్లు సుమారు 160 మంది వరకు వారం రోజులుగా నిరవధిక సమ్మెకు దిగారు. పాఠశాలల్లో విద్యార్థులే వంటలు వండుకుంటున్నారు. అలాగే ఏటూరునాగారం ఏటీడీవోగా పనిచేస్తున్న క్షేత్రయ్య 20 రోజుల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. ఈ పోస్టు ఖాళీ ఉండగా ములుగు ఏటీడీవోగా పనిచేస్తున్న దేశీరాంనాయక్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇప్పటికే ఆయన మహబూబాబాద్ ఏటీడీవోగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న డీటీడీవో అదనపు బాధ్యతలను సైతం ఆయనే తీసుకున్నారు. ఇక గిరిజన సంక్షేమశాఖ విద్యావిభాగంలోని కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి పోస్టు ఖాళీ ఉండగా అందులో హనుమకొండ డీటీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కిరణ్‌కు ఏవోగా బాధ్యతలు అప్పగించారు. ఇక్కడి కార్యాలయంలో రెండు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇక గిరిజన సంక్షేమశాఖ విద్యా విభాగంలో కీలకమైన పోస్టులు ఖాళీ ఉండడంతో పాఠశాలలపై పర్యవేక్షణ కూడా కొరవడింది. ఇటు అధికారులు, అటు వర్కర్లు లేక పాఠశాలలు, హాస్టల్స్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారగా, వాటిని తనిఖీ చేసే వారే లేకుండా పోయారు. ఇదిలా ఉండగా ఖాళీ అయిన డీడీ పోస్టులో ఇంకా ఎవరినీ నియమించకపోవడం వెనుక మతలబు ఏమిటో అర్థం కాకుండా ఉంది.