హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.బుధవారం నుంచి గురువారం వరకు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ , వరంగల్ , హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి, మెదక్ , కామారెడ్డి జిల్లాలో వర్షాలు పడుతాయని పేరొంది.
గురువారం నుంచి శుక్రవారం వరకు ఆసిఫాబాద్ , మంచిర్యాల, భూపాలపల్లి, మేడ్చల్ మలాజ్గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అకడకడా భారీ వర్షాలు పడుతాయని వివరించింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో బంగాళాఖాతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో 26న ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో , 27,28వ తేదీల్లో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ నెల మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత అత్యంత చురుకుగా కదిలి ఈ నెల 14 నాటికీ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి.
ఈ నెలలో రాష్ట్రంలోని చాలా చోట్ల లోటు వర్షపాతం నమోదయ్యే పరిస్థితులే కనిపిస్తున్నట్టు తెలిపింది. జూన్ నెలలో ఇప్పటి వరకు 7.85 సెంమీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, మంగళవారం నాటికి 8.53 సెంమీ వర్షం కురిసింది. ఈ నెల చివరి వారంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కావొచ్చని అంచనా వేస్తునప్పటికీ, తూర్పు ప్రాంత జిల్లాలోనే ఎక్కువగా అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 7 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.