హైదరాబాద్,జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాలు కాస్త మందగించడంతోపాటు గాలిలో తేమ తగ్గడం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు తెలిపారు.
ఫలితంగా 38 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. నైరుతి రుతుపవనాలు బుధవారం నుంచి చురుగ్గా మారాయని, ఫలితంగా రాబోయే 3 రోజులు వర్షాలు కురువొచ్చని పేర్కొన్నారు. బుధవారం ఆసిఫాబాద్, ములుగు, వరంగల్, భద్రాద్రి-కొత్తగూడెం, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయని వెల్లడించారు. అత్యధికంగా ఆసిఫాబాద్ మండల కేంద్రంలో 6.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు పడొచ్చని అంచనా వేశారు.