చంద్రబాబు పరిస్థితి ‘కూట్లో రాయి తీయలేని వాడు..ఏట్లో రాయి తీస్తా అని ఉరికినట్టు ఉన్నది. ఏపీ ప్రజలే చంద్రబాబు పాలన బాగాలేదని చిత్తుచిత్తుగా ఓడించారు. ఇప్పుడు ఇక్కడికొచ్చి ఏదో చేస్తానని ఆయన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నది.ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా? – మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పొత్తుకోసమే టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరలేపారని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అందులో భాగంగానే ఖమ్మంలో బహిరంగ సభ పెట్టి హడావిడి చేశారని ఆరోపించారు. ఎన్ని పాట్లు పడ్డా.. ఎన్ని ఫీట్లు చేసినా తెలంగాణలో చంద్రబాబు ఆటలు సాగవని తేల్చి చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ అడిగిన రైతులను పిట్టల్లా కాల్చిచంపి, ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగ యువతను నక్సలైట్లు అని ముద్రవేసి కాల్చి చంపిన చంద్రబాబు నిజస్వరూపం తెలంగాణ సమాజానికి బాగా తెలుసని అన్నారు. గురువారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్‌కుమార్, వీ శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌తో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు పరిస్థితి ‘కూట్లో రాయి తీయలేనివాడు..ఏట్లో రాయి తీస్తా అని ఉరికినట్టు ఉన్నది. సచ్చిపోయిన బర్రెనట.. పలిగిపోయిన బుడ్డెడు పాలు ఇచ్చిందట’ అన్నట్టుగా ఉన్నది అని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే చంద్రబాబు పాలన బాగాలేదని చిత్తుచిత్తుగా ఓడించారని, ఇప్పుడు ఇక్కడికొచ్చి ఏదో చేస్తానని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు.
బాబు హయాంలోనే తెలంగాణ దోపీడీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం అత్యధికంగా దోపిడీకి, నిర్లక్ష్యానికి గురైంది చంద్రబాబు 9 ఏండ్ల పాలనలోనే అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రైతులు, యువత, ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాలకు అన్యాయం చేసింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. ఉద్యోగులను గుర్రాలతో తొక్కించి…వాటర్ క్యానన్లతో కొట్టించిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు.
హైదరాబాద్‌ను ఫ్రీ జోన్ పేరిట హస్తగతం చేసుకొని తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టిన చంద్రబాబు చరిత్రను ఎవరూ మరచిపోలేదని స్పష్టంచేశారు. ‘అన్నీ తన వల్లే.. ఆఖరికి తెల్లారినా, పొద్దుగూకినా తన వల్లనే జరుగుతున్నాయన్నట్టుగా, కోడి సైతం తన వల్లే కూసింది అన్నట్టుగా చంద్రబాబు మాటలు ఉంటాయి. బిల్‌క్లింటన్, స్విట్జర్లాండ్ ప్రధాని, వరల్డ్ బ్యాంకు చైర్మన్‌ను తానే తీసుకొచ్చానని చెప్పుకోవడం అలవాటైన చంద్రబాబు, తాజాగా కరోనాకు వ్యాక్సిన్ తానే కనుగొన్నానని చెప్పుకొని తిరుగుతున్నారు. మరో పక్క బీజేపీ నేతలేమో కరోనా వ్యాక్సిన్‌ను తమ నాయకుడు నరేంద్రమోదీ కనుగొన్నారని ప్రచారం చేసుకొంటున్నారు. పాపం కరోనాకు నిజంగా వ్యాక్సిన్ కనిపెట్టిన సైంటిస్టు, కంపెనీ ఎక్కడ పోయాయో’ అని ఎద్దేవా చేశారు.
ఫ్లోరోసిస్ పేరిట ఓట్లు దండుకున్నది బాబే
నల్లగొండలో ఫ్లోరోసిస్‌ను తానే పోగొట్టానని చంద్రబాబు పోజులు కొట్టారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. దమ్ముంటే నల్లగొండలో ఫ్లోరోసిస్‌పై చర్చకు రావాలని సవాల్ విసిరారు. నల్లగొండ ఫ్లోరైడ్ కష్టాలు తీర్చింది ముమ్మాటికీ కేసీఆరేనని స్పష్టంచేశారు. ఫ్లోరోసిస్ పేరుమీద ఓట్లు దండుకున్నది చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు హయాంలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని ఆరోపించారు. కరెంట్ కావాలని అడిగినందుకు రైతులను బషీరాబాగ్ చౌరస్తాలో పిట్టల్లాగా కాల్చిచంపారని, ఉచిత కరెంటు అడిగితే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అవహేళన చేసిన నీచమైన చరిత్ర చంద్రబాబుది అని ధ్వజమెత్తారు.
చంద్రబాబుది భస్మాసుర హస్తం
చంద్రబాబుది భస్మాసుర హస్తమని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. 2018లో చంద్రబాబు కట్టిన మహాకూటమి ఆయన వల్లే కుదేలైందని తెలిపారు. ‘చంద్రబాబు ఏం చేసినా, ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని కథలు పడ్డా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఎన్టీయార్‌పై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదు. ఎన్టీయార్ గొప్పతనంపై కేసీఆర్ అనేకసార్లు చెప్పారు. ప్రస్తుత టీడీపీ, ఎన్టీయార్ పెట్టిన టీడీపీ ఒకటి కానేకాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చంద్రబాబు నిజస్వరూపం అందరికీ తెలుసు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయత్వం వల్లే అభివృద్ధి చెందింది’ అని స్పష్టం చేశారు.
చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు తెచ్చినా ముక్కు నేలకు రాస్తా: పువ్వాడ
చంద్రబాబు వల్లే ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్టపోయిందని కార్మిక శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. తెలంగాణలో భాగమైన భద్రాచలం డివిజన్లోని 7 మండలాలను, సీలేరు పవర్‌ప్లాంట్‌ను ఏపీకి గుంజుకపోయింది చంద్రబాబేనని ఆరోపించారు. తన వల్లే ఖమ్మం అభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పుకొంటున్న చంద్రబాబు, ఖమ్మం జిల్లాకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు తెచ్చానని నిరూపించినా తాను ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. అన్ని రంగాల్లో ఖమ్మం జిల్లా అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయత్వంలోనే జరిగిందని స్పష్టంచేశారు. ‘సీఎం కేసీఆర్ వల్లే ఖమ్మానికి జల వైభవం వచ్చింది. మంత్రి కేటీఆర్ వల్ల ఐటీ హబ్, హరీశ్‌రావు వల్ల మెడికల్ కాలేజీ వచ్చాయి. ఖమ్మం జిల్లా వరప్రదాయినిగా సీతారామా ప్రాజెక్టును ఇచ్చి సాగునీటి కష్టాలు తీర్చిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్’ అని పేర్కొన్నారు.
గుర్రాలతో తొక్కించిన బాబు ఘనతను మరువం: శ్రీనివాస్ గౌడ్
జీతాలు పెంచాలని అడిగిన అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించి…ఆశ వర్కర్లను వాటర్ క్యానన్లతో కొట్టించిన నీచమైన చంద్రబాబు చరిత్రను ఎవరూ మరచిపోరని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. తెలంగాణ పదాన్నే నిషేధించిన చంద్రబాబు నిజస్వరూపం ప్రజలందరికీ తెలుసని అన్నారు. కరువు జిల్లా పాలమూరు పేరు చెప్పుకొని ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చి దాన్ని ఆంధ్రాకు తరలించిన ఘనుడు చంద్రబాబు ధ్వజమెత్తారు.
తెలంగాణ కోసమే నాడు చంద్రబాబుతో పొత్తు
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ ఒక్కొక్క రాజకీయ పార్టీని జై తెలంగాణ అనిపించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. నై తెలంగాణ అనేవాడితో జై తెలంగాణ అనిపించే వ్యూహంలో భాగమే 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకొన్నామని చెప్పారు. ‘ఏ రాష్ట్రం నేతకైనా సొంత రాష్ట్రం మీద ప్రేమ ఉంటదని ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని మోదీ నిరూపించారు. అట్లాగే తెలంగాణ మీద సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమ మరే నేతకు ఉండదు. తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ చంద్రబాబుకు ఉంటదా? తెలంగాణపై బాబు మొసలి కన్నీళ్లు అందరికీ తెలుసు. తెలంగాణలో చంద్రబాబు పోటీచేస్తానంటే వద్దన్నమా? చంద్రబాబు గురించి…ఆయన ద్రోహం గురించి తెలంగాణ ప్రజలకు తెల్వదా?’ అని హరీశ్‌రావు అన్నారు.
రైతులకు కేసీఆర్ చేసినంత మేలు ఎవరూ చేయలేదు
దేశంలో రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినంత మేలు ఎవరూ చేయలేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు 9 విడుతల్లో రూ.57 వేల కోట్లు ఇచ్చారని, రూ.5 వేల కోట్ల రైతుబీమాతోపాటు ఉచితంగా సాగు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ఒక్కరేనని స్పష్టంచేశారు. రైతుల ట్రాక్టర్లకు పన్నులు మాఫీ చేసి, రూ.550 కోట్ల పాత బకాయిలను సైతం రద్దుచేసిన నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.
తెలంగాణలో చెరువులు, కాలువలను చంద్రబాబు ఆగం చేస్తే, మిషన్ కాకతీయతో వాటిని పునరుద్ధరించి 25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ‘ కల్వకుర్తికి చంబ్రబాబు కొబ్బరికాయ కొడితే, రాజశేఖర్‌రెడ్డి మొక్కలు నాటుడు.. రాజశేఖర్‌రెడ్డి కొబ్బరికాయ కొడితే.. చంద్రబాబు మొక్కలు నాటుడు. ఇద్దరు కలిసి మహబూబ్‌నగర్‌ను ఆగం చేసిండ్రు. కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తిచేసి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్. చంద్రబాబువన్నీ మాటలైతే మావి చేతలు’ అని తేల్చిచెప్పారు.
2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక రైతులకు అన్యాయం చేశానని చెంపలేసుకొన్న విషయం మరిచిపోయావా చంద్రబాబూ? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. వ్యవసాయం దండుగ.. ఐటీ ముద్దు అన్న చంద్రబాబు, చివరకు ఐటీకి కూడా ఒరగపెట్టింది ఏమీ లేదని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. 2018లో మహాకూటమితో తెలంగాణపై చంద్రబాబు కుట్ర చేస్తే ప్రజలంతా ఏకమై చిత్తుచేశారని అన్నారు. తెలంగాణలో బలం ఉన్నదని చూపించేందుకు ఖమ్మంలో సభ పెట్టి ఏపీ నుంచి జనాన్ని తరలించారని ఆరోపించారు.
తెలంగాణ వనరులను కొల్లగొట్టేందుకు కుట్రలు
తెలంగాణ రాష్ట్రంలో సృష్టించుకున్న వనరులను కొల్లగొట్టేందుకు కొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ కూతురు షర్మిల తెలంగాణలో పాదయాత్రల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. పవన్‌కల్యాణ్, కేఏ పాల్ లాంటి వాళ్లు అదే ధోరణితో రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా, చంద్రబాబు రంగంలోకి దిగారు. ఆ నాయకుల డ్రామాలకు మోసపోతే.. మళ్లీ 1956 నాటి పరిస్థితి పునరావృతం అవుతుంది. వారి కుట్రలను తిప్పికొట్టాలి. అప్రమత్తంగా ఉండాలి.
– గంగుల కమలాకర్,పౌరసరఫరాల శాఖ మంత్రి
పొద్దుపోక చంద్రబాబు సభలు
ప్రజల చేతిలో తిరస్కారానికి గురైన టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు పొద్దుపోక సభలు పెడుతున్నారు. తెలంగాణలో, ఆంధ్రాలో ఫెయిల్ అయిన చంద్రబాబు.. ఉనికి కోసం లోపాయికారీగా బీజేపీతో మిలాఖత్ అయ్యారు. రెండు రాష్ర్టాల ప్రజలు బాబును నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణలో టీడీపీ ఉనికిలోనే లేదు. నమ్మి చేరదీసిన ఎన్టీఆర్‌ను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జూనియర్ ఎన్టీఆర్‌ను కోరుకుంటున్నారు.
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్ మంత్రి
చంద్రబాబును ప్రజలెప్పుడో రిజెక్ట్ చేశారు
చంద్రబాబు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేసి టీడీపీని మళ్లా రివైవ్ చేయాలంటూ కోరటం సిగ్గుచేటు. గతంలో నే చంద్రబాబును ఈ ప్రాంత ప్రజలు తిరస్కరించారు. బాబు తెలంగాణ బాగును కోరినవారు కాదు. ఆయనను తెలంగాణ ప్రజలు ఎప్పుడో రిజెక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చి రాజకీయం చేద్దాం అనుకుంటే మళ్లీ రిజెక్ట్ చేస్తారు. చుక్కలు ఎన్ని ఉన్నా చందమామ ఒక్కడే అన్నట్టు.. ఎన్ని పార్టీలు వచ్చినా తెలంగాణలో కేసీఆర్ ఒక్కరే ప్రజల గుండెల్లో ఉంటారు.
-కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ