Harish Rao | సాధారణంగా టెండర్ షరతులు మార్చిస్తే అన్ని కాంట్రాక్టర్లతో సమావేశం పెట్టాలని.. వారి అభిప్రాయాలు తీసుకోవాలని.. మినిట్స్ నమోదు చేయాలని హరీశ్‌రావు తెలిపారు. కానీ ఇక్కడ అది జరగలేదని అన్నారు.. ఈ తతంగం వెనుక ఏం జరిగింది? మీటింగ్ మినిట్స్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఒకటి.. రెండు కాదు.. పదుల సంఖ్యలో స్కాములు జరిగాయని తెలిపారు. నేను ఇప్పటికి ఓబీ స్కాం, సోలార్ స్కాం మాత్రమే చెప్పాను. సింగరేణిలో ఇంకా అనేక స్కాములు ఉన్నాయని అన్నారు. ఈ కుంభకోణంలో కింగ్ పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టాడు? ముఖ్యమంత్రి బంధువు కూడా ఆ హోటల్లో కూర్చున్న ఫోటోలు మా దగ్గర ఉన్నాయని.. వాటిని టైం వచ్చినప్పుడు బయట పెడతామని తెలిపారు.
డీజిల్‌ను కాంట్రాక్టర్ల పరిధిలోకి తెచ్చిన తర్వాత టర్నోవర్ అర్హత పెంచి 20 ఏళ్ల అనుభవం ఉన్న స్థానిక కాంట్రాక్టర్లను పక్కన పెట్టారని హరీశ్‌రావు తెలిపారు. ఇక నుంచి డీజిల్ కాంట్రాక్టర్ల పరిధిలోనే ఉంటే, ఉన్న కాంట్రాక్టర్లు స్వయంగా డీజిల్ కొనుగోలు చేసుకునే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మీ స్వార్థం కోసం మైనింగ్ అనుభవం లేని కొత్త కాంట్రాక్టర్లకు దారులు తెరిచారని అన్నారు. మేము బొగ్గు స్కాం అని భయపెట్టగానే నాలుగు పేపర్లు పట్టుకొని వచ్చి, మీడియాని సైతం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన భట్టి గారు.. నేను బయటపెట్టిన సోలార్ స్కామ్, పేలుడు పదార్థాల స్కామ్, ఉద్యోగుల డీ–ప్రొమోషన్ వంటి కీలక అంశాలపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. సింగరేణిలో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో స్కాములు జరిగిందన్నది వాస్తవం కాబట్టి ఆయన సైలెంట్‌గా ఉన్నారని అన్నారు. అడ్డగోలుగా నిబంధనలు మార్చి, రేవంత్ రెడ్డి బావమరిదికి, ఇతర అనుయాయులకు టెండర్లు కట్టబెట్టింది నిజమని అన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో స్కీములు రాలేదు గానీ పదుల సంఖ్యలో స్కాంలు మాత్రం వచ్చాయని ఎద్దేవా చేశారు.
ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో సింగరేణిలో స్కాములు జరిగాయి
నేను రెండే బైటపెట్టాను.. చాలా ఉన్నాయి
వీళ్లు ఏ హోటల్లో మీటింగ్ పెట్టారో నా దగ్గర ఫోటోలు ఉన్నాయి టైం వచ్చినప్పుడు విడుదల చేస్తాను – హరీష్ రావు pic.twitter.com/Kssumh8coT
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2026
ఈరోజు మీ అవినీతి వల్ల సింగరేణిలో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లను లేకుండా చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు. అందుకనే రోజురోజుకి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉత్పత్తి పడిపోయిందని హరీశ్‌రావు తెలిపారు. బొగ్గు అమ్మకాలు తగ్గిపోయాయయన్నారు. సింగరేణిలో జరిగిన స్కాంలు మొత్తం సంస్థనే ఎఫెక్ట్ చేస్తున్నాయన్నారు. ఇవి నేను చెప్పడం లేదు.. సింగరేణి గణాంకాలే చెబుతున్నాయని స్పష్టం చేశారు. ‘ రేవంత్ రెడ్డి పాలనలో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లను పక్కన పెట్టడం వల్ల ఉత్పత్తి పడిపోయింది.BRS హయాంలో 2021లో 50 MT, 2022లో 62 MT, 2023లో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాం. కాంగ్రెస్ రాగానే 2024-25లో 69 MTకి తగ్గింది. ఇప్పుడు 2025-26లో (గత 9-10 నెలల్లో) కేవలం 43 మిలియన్ టన్నులకు పడిపోయింది.’ అని హరీశ్‌రావు తెలిపారు. నష్టాల్లో ఉన్న సింగరేణిని కేసీఆర్ లాభాల బాట పట్టిస్తే… రేవంత్ రెడ్డి 6000 కోట్ల కుంభకోణంతో సింగరేణికి మచ్చ తెచ్చారన్నారు.