హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఇసుక రవాణాను బడా కాంట్రాక్టర్లకు అప్పగించవద్దని లారీల యజమానుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం నాయకులు గనులశాఖ ముఖ్యకార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. కొత్త విధానం అమల్లోకి వస్తే ఇసుక వ్యాపారాన్ని నమ్ముకుని జీవిస్తున్న తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్లు దోపిడీకి పాల్పడుతూ తమపై వేధింపులకు దిగుతున్నారని వివరించారు.
ప్రతీరోజు ఇసుక రీచ్ల వద్ద కాంట్రాక్టర్లు దాదాపు రూ.2.3 కోట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిని కట్టడి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని సూచించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని, డీడీలు చెల్లించినా కూడా రీచ్ల వద్ద లోడుకు రూ.2,500 నుంచి రూ.3000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని, వద్దన్నా వినకుండా ఓవర్లోడ్ చేస్తున్నారని తెలిపారు.
ఇదేంటని ప్రశ్నిస్తే ఇసుక లోడింగ్ చేయకుండా వెనక్కి పంపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇసుక కాంట్రాక్టర్ల అక్రమాల వెనుక కొందరు అధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. మరోవైపు ఓవర్లోడ్ వల్ల ఆర్టీవో, విజిలెన్స్, మైనింగ్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు జరిమాన విధిస్తున్నారని చెప్పారు. బాధ్యులైన కాంట్రాక్టర్లపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ప్రభుత్వం ఇసుక రవాణాను కొందరు కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నదని, ఒకవేళ అలాంటి ప్రతిపాదన ఉంటే వెనక్కి తీసుకోవాలని వేడుకున్నారు.