కోనరావుపేట/మక్తల్/బషీరాబాద్, డిసెంబర్ 24 : ఇసుక అక్రమ రవాణాను స్థానికులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అనుమతులు తీసుకున్న మేరకు కాకుండా అదనం గా తరలించడంపైనా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని ఓ గ్రామం లో ఇసుక మేటలను తీసుకెళ్లేందుకు వచ్చిన ముఠాపై రైతులు దాడికి పాల్పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కనగర్తి మూలవాగు నుంచి ఇసుక తరలింపును స్థానికులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కంసాన్పల్లి (బీ)లో ఇసుక మాఫియా, రైతులు కొట్టుకున్నారు. కంసాన్పల్లి (బీ) శివారులో వాగు పక్కన ఉన్న గొల్ల కృష్ణ, గొల్ల అశోక్ పొలంలో ఉన్న ఇసుక మేటలను మైల్వార్కు చెందిన దానం సాయిలు బుధవారం రెండు ట్రాక్టర్లలో కొంతమందిని తీసుకొచ్చి తరలించేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న అశోక్, కృష్ణ వారిపై దాడి చేయడంతో సాయిలుతోపాటు వెంట ఉన్న యశోదమ్మకు గాయాలయ్యాయి.
కాగా, ఓ ట్రాక్టర్ బురదలో ఇరుక్కోగా మరోటి తీసుకుని పారిపోయారు. ఇసుక తరలించేందుకు నారాయణపేట జిల్లా చిట్యాల సమీపంలోని వాగు మధ్యలో వేస్తున్న రోడ్డు పనులను రైతు లు అడ్డుకున్నారు. మాగనూరు మండలం గ జరందొడ్డికి చెందిన వాగు పరిసరాల్లో పొలా లున్న ముగ్గురు రైతుల పేరుపై కాంగ్రెస్ నా యకులు తరలింపు అనుమతులు పొందిన ట్టు తెలిసింది. 15 రోజుల్లో 7,743 క్యూబిక్ మీటర్లు తరలించాలనే నిబంధన మేరకు మక్తల్ మండలం చిట్యాల సమీపంలోని పెద్దవాగు మధ్యలో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడంతో విషయం తెలుసుకొన్న చిట్యాల, గజరందొడ్డి గ్రామాలకు చెందిన రైతులు వాగు వద్ద పనులను అడ్డుకున్నారు. అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి మూలవాగులో అనుమతి తీసుకొని ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకున్నారు. అధికారులు ఇష్టారీతిన అనుమతులిస్తూ ట్రాక్టర్ యజమానులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. అనుమతి ఒకచోట ఇస్తే మరోచోట నుంచి ఇసుక తరలిస్తున్నారని, అనుమతికి మించి తరలిస్తున్నారని మండిపడ్డారు. తమ అనుమతి మేరకు ఇసుకను తరలించాలని డిమాండ్ చేయడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.