Nallamala Forest | అచ్చంపేట, జనవరి 20 : నల్లమలలో మైనింగ్ మాఫియా ఆగడాలపై స్థానికులు భగ్గుమన్నారు. సీఎం సొంత ప్రాంతమైన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామాన్ని ఆనుకొని ఉన్న పలుగురాళ్ల గుట్టను మైనింగ్ మాఫియా ముడిసరుకును (తెల్లరాయి) వెలికితీసే పనులు చేపట్టింది. దీన్ని నిరసిస్తూ సోమవారం గ్రామం లో రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టగా.. పోలీసులు తెల్లవారుజామున 5 గంటలకే గ్రామంలోకి చొరబడి పలువురిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా దీక్షలు చేపట్టిన వారిని అరెస్టు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు నిరసనగా స్థానికులు రహదారిపై అడ్డంగా ముళ్లకంప, కట్టెలు వేసి సాయంత్రం వరకు ఆందోళన చేపట్టారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే పోలీసులు గ్రామంలోకి వచ్చి భయపెడుతున్నారని మహిళలు మండిపడ్డారు. ‘మా పొలాల వద్దకు వచ్చి మా పిల్లలు, పెద్దలను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్తున్నారు’ అంటూ దుమ్మెత్తిపోశారు. వారందరినీ వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రాణాలు పోయినా మైనింగ్‌కు అంగీకరించేది లేదంటూ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు శాపనార్థాలు పెట్టారు. పనులు నిలిపివేయాలని, అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టాలంటూ ఓ మహిళ పురుగుల మందు తాగేందుకు యత్నించగా.. పక్కన ఉన్నవారు అడ్డుకున్నారు. కాగా నిరసన తెలుపుతున్న ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. ఈ క్రమంలో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. పోలీసులు వెంటనే గ్రామాన్ని విడిచి వెళ్లాలని పెద్ద పెట్టున నినదించారు. గ్రామ సభ అనుమతి లేకుండా మైనింగ్ ఎలా జరుపుతారని నిలదీశారు. చేసేది లేక పోలీసులు అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టడంతో మైలారం వాసులు శాంతించారు. మైనింగ్ తవ్వకాలకు సంబంధించి కవరేజీ కోసం వెళ్లిన మీడియాను అక్కడున్న మైనింగ్ మాఫియా అడ్డుకున్నది. ఫొటోలు తీయడానికి ప్రెస్‌కు అనుమతులు లేవని దురుసుగా ప్రవర్తించారు. దారికి అడ్డంగా టిప్పర్ ఉంచి చాలా సేపు అడ్డుకొన్నారు.
మైలారంలో స్థానికులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న మానవ హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్‌ను వెల్దండ పోలీసులు అరెస్ట్ చేసి గంట తరువాత విడిచిపెట్టారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం బలప్రయోగం చేయడం సరికాదని అన్నారు. ప్రజలతో చర్చించిన తర్వాతే మైనింగ్ పనులపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లేకుంటే పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.