ఖైరతాబాద్, జూన్ 23 : కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తొండి చేస్తే తడాఖా చూపిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. వెనుకబడిన తరగతుల ప్రజాప్రతినిధుల వేదిక ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రయత్నించకుండా, కేంద్రంపై నెట్టేసి ఎన్నికలకు పోతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత ప్రధానిని ఎందుకు కలువలేదని, పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీలు కనీసం పార్లమెంట్లో ప్రస్తావించలేదని, సమావేశాలను స్తంభింపచేయలేదని, అఖిలపక్షం సమావేశం కూడా నిర్వహించలేదని దుయ్యబట్టారు.
అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోకుండా పార్లమెంట్లో బిల్లు ఎట్లా పాసవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రయత్నాలను ఎప్పుడో చేసేదని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలతో మొదటికే మోసం వచ్చేటట్టు ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే పాత రిజర్వేషన్ల కంటే అత్యంత తక్కువ సీట్లు కేటాయించి చేతులు దులుపుకోవాలని భావిస్తున్నట్టు ఉన్నదని మండిపడ్డారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత, మండలానికో బీసీ గురుకుల పాఠశాల, కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు తదితర హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. బీసీలు రూ.లక్ష రుణం తీసుకుంటేనే తలుపులు పీక్కొనిపోతున్నారని, దేశంలో రూ.లక్షల కోట్లు ఎగ్గొట్టిన వారిని వదిలిపెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సోయి తెచ్చుకొని బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొనిపోవాలని, లేనిపక్షంలో తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు.