హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు వెనుకబడినవర్గాలకు 42% రిజర్వేషన్లు అమలుచేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. నిర్ణీత గడువులోగా కులగణన ప్రక్రియను పూర్తిచేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జంతువులు, పక్షుల గణనకు సర్వేలు చేసే ప్రభుత్వాలు బీసీ కులగుణన చేపట్టకపోవడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. వెనుకబడిన వారి వివరాలు తేలితే తిరుగుబాటు వస్తుందనే భయంతోనే మిన్నకుండిపోయాయని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని రాష్ర్టాల్లో కులగణన చేపట్టాలని, మండల్ కమిషన్ సిఫార్సులను అమలుచేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన బాధ్యతలను బీసీ సంక్షేమ శాఖకు కాకుండా టౌన్‌ప్లానింగ్ విభాగానికి ఎందుకు అప్పగించిందని ప్రశ్నించారు. సమావేశంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్, గొర్రెలు, మేకల సహకార సంఘం మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య పాల్గొన్నారు.