హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలు చీదరించుకుంటున్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉండటం, పార్టీ నాయకుల్లో వర్గ పోరుతో ప్రజల్లో పార్టీ బాగా చులకన అయిపోయిందా? 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయాణంలో అడుగడుగునా ప్రతికూల సంకేతాలు కనిపించాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఉన్న పరువు కాస్తా గంగలో కలిసిపోతుందా?.. అంటే పార్టీ అంతర్గతంగా నిర్వహించిన మూడు సర్వేలు ఔననే సమాధానం చెప్తున్నాయట. దాదాపు మూడు నెలలకుపైగా సాగుతున్న మీనాక్షి నటరాజన్ సమీక్షలు, కాంగ్రెస్ వ్యూహకర్త నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వే, థర్డ్ పార్టీ ఏజెన్సీతో చేయించిన ఐవీఆర్ సర్వేల్లో ఒకే తరహాలో ప్రతికూల ఫలితాలే వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఐదురుగు మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేల పనితీరు అసలే బాగాలేదని ప్రజలు తేల్చి చెప్పినట్టు సమాచారం. 52% మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను వదిలిపెట్టి సొంత పనులపై మోజు పెంచుకున్నారని తేలిందని చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే బొక్కబోర్లా పడటం ఖాయమని, జాతీయస్థాయిలో పరువు గంగ లో కలుస్తుందని పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మంత్రులకు, ఎమ్మెల్యేలకు వదిలేసి తాను తప్పుకుంటున్నట్టు అధిష్ఠానానికి సమాచారం ఇచ్చారని చర్చ నడుస్తున్నది. బీసీ రిజర్వేషన్లను సాకుగా చూపి కాలయాపన చేయాలని స్కెచ్ వేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు ముగించాలని హైకోర్టు గడుపు పెట్టడంతో కాంగ్రెస్ పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్టుగా తయారైందట.
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలాబలాలు, బలహీనతలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మార్చి నుంచి దశలవారీగా సమీక్షలు నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఏఐసీసీ కార్యదర్శులు, నాయకులు.. ఇలా అనేక విడతలుగా చర్చలు జరిపి అభిప్రాయాలు సేకరించారు. గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉన్నది? కార్యకర్తలు ఏమంటున్నారు? రైతులు, కూలీ లు, మహిళల్లో పార్టీ, పాలనపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు? సంక్షేమ పథకాలు అమలుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? పార్టీ బలోపేతానికి ఏం చేస్తే బాగుంటుంది? వంటి ప్రశ్నలు వేసి సమాధానాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేల్లో 40% మంది నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారని గుర్తించినట్టు సమాచారం. 75 % నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలున్నాయని తేలిందని చెప్పకుంటున్నా రు. ఈ అంశం మీనాక్షిని కలవరపరిచినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేయడం కోసం ఏప్రిల్ చివరి వారం నుంచి మే చివరి వారం వరకు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం గ్రామాల్లో సర్వే చేసినట్టు తెలిసింది. ఇందులో ఐదుగురు మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగాలేదని తేలిందట. 52 శాతం మంది ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల కంటే సొంత పనుల మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్టు ప్రజలు తేల్చి చెప్పారట.
రాష్ట్రవ్యాప్తంగా మే 25 నుంచి జూన్ 10 వరకు ఐవీఆర్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) సర్వే జరిగింది. ప్రభుత్వమే థర్డ్ పార్టీ ఏజెన్సీతో సర్వే చేయిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ప్రధానంగా సీఎం కార్యాలయం ఒక ప్రైవేటు ఏజెన్సీతో సర్వే చేయించిందని ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతున్నది. నియోజకవర్గాలవారీగా ఓటర్లకు ఫోన్ చేశారని, కాల్ రిసీవ్ చేసుకోగానే సర్వే మొదలైపోతుందని చెప్తున్నారు. ‘మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది?’ అని అడిగి, బాగుంది, పర్వాలేదు, బాగాలేదు, చెప్పలేం అనే 4 ఆప్షన్లతో సమాధానాలు సేకరించినట్టు పేర్కొన్నారు. ఈ సర్వే ఫలితాల్లో 47శాతం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పనితీరు బాగా లేదని ప్రజలు తేల్చిచెప్పినట్టు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఎప్పటికప్పుడు ఎంగడట్టమే కాకుండా, ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెప్తున్నారని పలువురు నేతలు మీనాక్షికి చెప్పినట్టు సమాచారం. వారు పథకాల అమలుపై నిలదీస్తున్నారని, మ్యానిఫెస్టోపై దబాయించి అడుగుతున్నారని, ప్రభుత్వాన్ని ఎదురించి ఆందోళనలకు దిగుతున్నారని చెప్పినట్టు తెలిసింది. దొరికిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మలుచుకొని ప్రభుత్వ పనితీరును ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ అంశాన్ని ఆమె అధిష్ఠానానికి నివేదించినట్టు సమాచారం.