హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ శాఖలో పైరవీలు జోరందుకున్నాయి. బదిలీల్లో నచ్చిన చోట పోస్టింగ్ ఇప్పించుకునేందుకు ఉద్యోగులు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కమిషనరేట్‌తోపాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాం తాల్లో పాగాకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, మరికొందరు ఉన్నచోటు నుంచి కదలకుండా ఉండేందుకు కృషి చేస్తున్నారు. ఇందుకోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో చెప్పిస్తున్నారు. కొందరు ఉద్యోగులు ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను జత చేస్తుంటే, మరికొందరు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు మంత్రులు, ఎమ్మెల్యేలతో ఫోన్లు చేయిస్తున్నట్టుగా తెలిసింది. ఇంకొందరైతే ఏకంగా ప్రజాప్రతినిధులను వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు తీసుకొస్తుండటం గమనార్హం.
పైరవీల జోరులో భా రీ మొత్తంలో డబ్బు చేతులు మారుతున్న ట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మధ్యవర్తుల రూపమెత్తిన కొందరు ఉద్యోగుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నా యి. ఈ నెల 28న బదిలీ ఉత్తర్వులు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ లోపే తమ పైరవీని పూర్తిచేసుకునేందుకు ఉద్యోగులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వారం క్రితం వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపీ.. బదిలీలకు సంబంధించి ఉద్యోగల సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పైరవీలకు సంబంధించి ఉద్యోగులకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. ఎవరైనా బదిలీ కోసమో, బదిలీని ఆపేందుకో మంత్రులు, ఎమ్మెల్యేలతో పైరవీ లేఖలు తీసుకురావడం, ఫోన్లు చేయించడం చేస్తే, వారిని సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించినట్టు సమాచారం.