నిజామాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల రుణాలు మాపీ చేసిందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఇంటి నిర్మాణం కోసం పేదలు తీసుకున్న రుణాలను అదేవిధంగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గురువారం వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రజా కళ్యాణ మండపంలో పేద క్రిస్టియన్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన కానుకలను ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావుతో కలిసి పంపిణీ చేశారు.
మంత్రి మాట్లాడుతూ తమకు అనుకూలమైన కార్పొరేట్లకు 12 లక్షల కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేయించిందని దుయ్యబట్టారు. పేదలను , రైతులను కేంద్రం మోసం చేస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో మరెక్కడా లేనివిధంగా అన్ని మతాల సంప్రదాయాల ను గౌరవిస్తూ వారి పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నామని అన్నారు.
ఇందులో భాగంగానే క్రిస్మస్ వేడుకల సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ, విందు ఏర్పాటు అని పేర్కొన్నారు. సమాజంలో అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, డీసీవో సింహాచలం, క్రిస్టియన్ డెవలప్ మెంట్ ఫోరమ్ అధ్యక్షుడు ఆనంద్ పాల్, ఇజ్రాయిల్, ప్రేమ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, పాస్టర్లు, క్రిస్టియన్లు పాల్గొన్నారు.