హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : రుణమాఫీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను నిలిపివేసి, రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు భాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో వారు మాట్లాడుతూ.. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కొర్రీలు విధించడం సమంజసం కాదన్నారు.
మార్గదర్శకాలను సవరించాలి: పటోళ్ల
రుణమాఫీ మార్గదర్శకాలను సవరించాలని మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
రుణమాఫీ జీవోను సవరించండి: తమ్మినేని
రైతులకు రుణమాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో-567లోని నిబంధనలతో పేద రైతులకు రుణమాఫీ వర్తించదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తంచేశారు. అత్యధిక మందికి రుణమాఫీ జరిగేలా జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపడిన దాదాపు 10 లక్షల కుటుంబాలు రుణమాఫీకి అర్హులు కాకుండా పోయే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
నిబంధనలే రైతులకు ఉరితాళ్లు: ఈటల
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): రుణమాఫీకి ప్రభుత్వం జారీ నిబంధనలే రైతులకు ఉరితాళ్లుగా మారాయని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే నిబంధనలు లేకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సర్కారుకు ప్రజాక్షేత్రంలో శిక్షతప్పదని హెచ్చరించారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు.
రుణమాఫీ షరతులపై రైతుల నిరసన
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు మంగళవారం నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా బస్టాండ్ సెంటర్లో రైతు రుణమాఫీ జీవో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ.. నిబంధనల్లో తెల్ల రేషన్‌కార్డు, పాస్ పుస్తకాలు, రెన్యూవల్, రీషెడ్యూల్, గడువును సవరించి రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆధార్‌కార్డు, పాస్‌బుక్, రేషన్‌కార్డు లేని కుటుంబాలు లక్షల్లో ఉంటాయని వారందరికీ అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం కొర్రీలు పెట్టకుండా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలని కోరారు.
– వైరాటౌన్