Rythu Runa Mafi | హైదరాబాద్, జూన్ 30(నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ విధి విధానాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనున్నట్టు తెలిసింది. ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహించే ‘రైతునేస్తం’ కార్యక్రమంలో రైతుల సమక్షంలోనే రుణమాఫీ విధి విధానాలను జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. నాలుగు రోజుల్లో రుణమాఫీ విధి విధానాలను విడుదల చేస్తామని ఇటీవల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు.
ఇప్పటికే రుణమాఫీ విధి విధానాల రూపకల్పన తుది దశకు చేరుకున్నట్టు తెలిసింది. దీనిపై ఇటు వ్యవసాయ, అటు ఆర్థిక శాఖ అధికారులు కుస్తీ పడుతున్నారు. ఆగస్టు 15లోపు రైతులకు సంబంధించిన రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని, ఇందుకు రూ.31 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. నిధులు సమకూరే మార్గాలను అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. దీంతోపాటు ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్టు సమాచారం.
రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్యలో కోతలు తప్పేలా లేవు. ఇందుకు సంబంధించి విధి విధానాల్లో పలు షరతులను విధిస్తున్నట్టు తెలిసింది. పాస్బుక్ జత చేసి బంగారం కుదువపెట్టి తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించబోదని ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. ముందుగా ప్రభుత్వం లీకులు ఇచ్చినట్టుగా పీఎం కిసాన్ పథకంలోని కొన్ని నిబంధనలను రుణమాఫీకి వర్తింపచేయనున్నట్టు తెలిసింది. ప్రజా ప్రతినిధులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, ఐటీ చెల్లించేవారిని రుణమాఫీకి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే, నిజమైన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, వారికి కచ్చితంగా రుణమాఫీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నట్టు సమాచారం.