బయ్యారం, ఆగస్టు 31: మహబూబాబాద్ జిల్లా బయ్యారం సహకార పరపతి సంఘంలో మూడు విడతల్లో కేవలం 34 శాతం మంది రైతులకే రుణమాఫీ జరిగింది. సొసైటీ పరిధిలో మొత్తం 2,845 మంది 8,90,25,482 రుణాలు పొందగా, అందులో తొలి విడతలో 436 మందికి రూ.1,22,22,115, రెండో విడతలో 342 మందికి రూ.76,21,560, మూడో విడతలో 203 మందికి రూ.6,95,59,65 రుణాలు మాఫీ అయ్యాయి. మొత్తంగా మూడు విడతల్లో కేవలం 34 శాతం మందికే రుణమాఫీ వర్తించింది.
అదేవిధంగా బయ్యారం ఏపీజీవీ బ్యాంకులో 1,403 మంది రుణాలు పొందగా 368 మందికి, ఎస్బీఐలో 720 మందికిగాను 287మందికి, యూనియన్ బ్యాంకులో 3,020 మందికి గాను 1,070 మందికి, గంధంపల్లి ఎస్బీఐలో 3,040 మంది రుణాలు తీసుకోగా 682 మందికి మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయి. సాంకేతిక కారణాలతో కొందరు, ఆధార్, బ్యాంకు పేర్లు తప్పుగా ఉండటంతో మరి కొందరు, కుటుంబంలో రూ.2 లక్షలకు మించి రుణం పొందిన వాళ్లు ఉండటం వంటి పలు కారణాలతో చాలామందికి రుణాలు మాఫీ కాలేదు. దీంతో రైతులు బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మాఫీ కోసం అవస్థలు పడుతున్నారు.
రుణమాఫీపై రైతుల ఆందోళన హనుమకొండ, మహబూబాబాద్‌లో ధర్నాలు
వరంగల్/నర్సింహులపేట, ఆగస్టు 31 : ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం వరంగల్, హనుమకొండ జిల్లాల కార్యదర్శి చిర్ర సూరి డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు కూలీ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో సీపీఎం జిల్లా నాయకుడె గునిగంటి మోహన్, కేవీపీఎస్ జిల్లా నాయకుడు మందుల యాకూ బ్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి, కొత్త రుణాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.