వరంగల్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నెక్కొండ : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామ రైతులకు రుణమాఫీ తీరని కలగా మారింది. రైతులందరికీ రూ.రెండు లక్షల్లోపు రుణాలు మాఫీ చేశామని ప్రభుత్వం చెప్తుండగా, మరి తమకు ఎందుకు కాలేదని ఈ గ్రామ రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి ఉన్నా తమ రుణాలు ఎందుకు మాఫీ కావడం లేదని ఏడాదిన్నరగా ఇక్కడి రైతులు పోరాటం చేస్తూనే ఉన్నా ఫలితం లేదు. తప్పు తమది కాదంటే తమది కాదని చెప్తూ బ్యాంక్లు, అధికారులు చేతులు దులుపుకొంటున్నారని, సమస్యను పరిష్కరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అలంకానిపేట గ్రామంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి అలంకానిపేట, తోపనపల్లి, బొల్లికొండ, పెద్దకొర్పోలు గ్రామాలకు చెందిన మొత్తం 1,477 మంది రైతులు రుణాలు పొందారు.
2024 జూలై-ఆగస్టు నెలలో మొదటి విడతలో 283 మంది రైతులకు, రెండవ విడతలో 110 మందికి, మూడవ విడతలో 65 మందికి, నాలుగవ విడతలో 48 మందికి చొప్పున మొత్తం 506 మంది రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. వీరికి రూ.3,68,24,320 రుణాలు మాఫీ అయ్యాయి. ఇంకా 971 మంది రైతులకు మాఫీ కాలేదు. ఈ రైతులకు చెందిన రూ.7,21,01,850 రుణాలు మాఫీ కావలసి ఉన్నది. ఈ బ్రాంచ్లో 34.25% మంది రైతులు మాత్రమే రుణమాఫీ ప్రయోజనం పొందారు. రుణమాఫీ ద్వారా ప్రయోజనం పొందని రైతులు 65.74% మంది ఉన్నట్టు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలే చెప్తున్నాయి. రుణమాఫీ కాని రైతులు నెక్కొండ వ్యవసాయాధికారి కార్యాలయం, బ్యాంకు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి కార్యాలయం, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే నుంచి మొదలుకొని మంత్రుల దాకా తమ గోడు వినిపిస్తున్నారు. అయితే, తప్పు తమది కాదంటే తమది కాదని అటు బ్యాంకు అధికారులు, ఇటు ప్రభుత్వ పెద్దలు ఎవరికి వారు చేతులు దులుపుకొంటున్నారే తప్ప తమ సమస్యకు పరిష్కారం చూపడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

భార్య, భర్తలం ఇద్దరం రూ.60వేలు, రూ.80వేలు రుణాలు తీసుకున్నాం. మాఫీ చేస్తరని అనుకున్నం. ఒక్కలకు కాకపోతే ఒక్కలకన్నా మాఫీ కావద్దా? ఏ జన్మల ఏం పాపం చేసినమో.. ఇప్పుడు మా బాకీ మాఫీ అయితలేదు.
2021లో రూ.90వేలు రుణంగా తీసుకున్నా. రుణమాఫీకి అర్హత ఉన్నా మాఫీ కాలేదు. జిల్లా కలెక్టర్ దగ్గరికి దగ్గరికి పోయినా ఏం ఫలితం వస్తలేదు.
మండలం మొత్తంలో ఒక్క ఐవోబీలోనే ఇబ్బంది ఎదురైంది. ఆ బ్యాంకు పరిధిలోని 971 మంది రైతులకు రుణాలు మాఫీ కావలసి ఉన్నది. ఉన్నతాధికారులకు పరిస్థితిని నివేదించాం.