హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం ధరలు (Liquor Prices) భారీగా పెరగనున్నాయి. ఎక్సైజ్ ఆదాయం ఆశించిన స్థాయిలో రాకపోవడంతోపాటు, ఎన్నికల హామీలు అమలు చేయడానికి మద్యం ధరలను పెంచడమే మార్గంగా కాంగ్రెస్ సర్కారు భావిస్తున్నది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో వాటికి సమానం చేయాలని ఆలోచిస్తున్నది. దీంతో రాష్ట్రంలో త్వరలోనే మద్యం ప్రియులకు షాక్ తగలనున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగా బీరుపై రూ.20, లిక్కర్ క్వార్టర్‌పై కనీసం రూ.20 నుంచి రూ.70 వరకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రతి నెల అదనంగా రూ.1000 కోట్లు ఆదాయం సమకూరనున్నట్లు లెక్కలు వేస్తున్నారు.
ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఎక్సైజ్ శాఖలో ఆదాయం రావడం లేదు. దీంతో ఇటీవల వాణిజ్య పన్నులు, ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వితో సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాబడులను పెంచుకునేందుకు కఠినంగా ముందుకు వెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే గుడుంబా, అక్రమ మద్యం నిరోధానికి కఠిన చర్యలు చేపట్టారు. కాగా, రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉన్నట్లు విమర్శలు రావడంతో గత ప్రభుత్వం 2023 మే నెలలో బీరుపై రూ.10, లిక్కర్‌పై రూ.20 లెక్కన తగ్గించింది. అయితే ఆదాయం పెంచాలని ప్రస్తుతం ప్రభుత్వం చెబుతుండటంతో గతంలో తగ్గించిన ధరలతో పాటు మరికొంత అదనంగా చేర్చి ధరలు పెంచాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో మద్యం ధరలను వీలైనంత త్వరగా సవరించాలని ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలోని 6 బ్రూవరీల్లో ఏటా 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతున్నది. ఆ బీరును తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలుచేసి మద్యం దుకాణాలకు సరఫరా చేస్తుంది. 12 బీర్లు ఉండే ఒక కేసుకు బేవరేజెస్ కార్పొరేషన్ లైట్ బీర్లకు రూ.289, స్ట్రాంగ్ బీర్లకు రూ.313 చెల్లిస్తున్నది. అక్కడి నుంచి మద్యం దుకాణాలకు రూ.1,400 చొప్పున చేరుతున్నది. మద్యం దుకాణాలు ఒక్కో కేసు రూ.1,800 చొప్పున అమ్ముకుంటున్నాయి. తయారీ కేంద్రాల వద్ద సుమారు రూ.24కి లభించే ఒక బీరు.. కార్పొరేషన్ చేతి నుంచి మద్యం దుకాణాలకు వచ్చేసరి రూ.117.. వినియోగదారులకు వచ్చేసరికి రూ.150 అవుతున్నది.
తమకు నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని, 2021 నుంచి ఇప్పటి వరకు ధరలు పెంచలేదని.. ఇప్పుడు కనీసం 20-25 శాతం ధరలు పెంచాలని అన్ని బ్రూవరీలు ఎక్సైజ్ కమిటీ ముందు ప్రతిపాదన పెట్టాయి. ఈ నెల మొదటి వారంలో ఒక్కో రోజు ఒక్కో బ్రూవరీ ప్రతినిధులను పిలిచి.. ఎక్సైజ్ కమిటీ విడివిడిగా మాట్లాడింది. గతంలో ఒక్కో కేసుకు రూ.289 ఉంటే.. పెరిగిన నిర్వహణ దృష్ట్యా తమకు రూ.450 ఇవ్వాలని ఆ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బ్రూవరీలకు అడిగినంతా రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఇవ్వాల్సి వస్తే.. బీర్ల ధరలు కనీసం 20 శాతం పెరగనున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలో 2,620 ఏ4 మద్యం దుకాణాలు, 1,200 బార్లు, క్లబ్బులు ఉన్నాయి. వీటి ద్వారా మద్యం క్రయ విక్రయాలు, అన్ని రకాల సుంకాలు కలుపుకొని రాష్ట్ర ఖజనాకు 2022లో రూ.32 వేల కోట్లు, 2023లో రూ.35 వేల కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని అదనంగా రూ.10 వేల కోట్లకు పెంచి.. రూ.45 వేల కోట్లు రాబట్టాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
మద్యం ఆదాయాన్ని మరో రూ.5,318 కోట్లు పెంచాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకొన్నది. ఎక్సైజ్‌శాఖలోని ఒక్క మద్యం విభాగం నుంచే రూ.25,617 కోట్ల నిధులను ఆశిస్తున్నట్టు వెల్లడించింది. ఆ మేరకు ఇప్పుడు బీర్ల ధరల పెంపునకు సిద్ధమైంది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే బీర్లు, లిక్కర్ కలిపి కనీసం 25 శాతం అదనంగా మద్యం అమ్మకాలు చేపట్టాల్సి ఉన్నది. దీంతో మరింత తాగించడం ఒకటి కాగా, రెండోది ధరలు పెంచడమే మార్గంగా కనిపిస్తున్నది. సరారుకు వస్తున్న ఆదాయ వనరుల్లో మద్యానిదే ప్రధాన పాత్ర. మద్యం అమ్మకాలు, ట్యాక్స్‌ల ద్వారా ఏటా సుమారు రూ.35 వేల కోట్ల వరకు సరారుకు ఆదాయం సమకూరుతున్నది. ఈ లక్ష్యాన్ని ప్రభుత్వం రూ.45 వేల కోట్లకు పెంచింది. ఈ క్రమంలోనే బీర్ల ధరలకు త్వరలో రెక్కలు రాబోతున్నాయి.