Liquor Price Hike | మందుబాబులకు రేవంత్ సర్కారు షాక్ ఇచ్చింది. ఇటీవల బీర్ల ధరలను పెంచిన ప్రభుత్వం తాజాగా మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విస్కీ, బ్రాందీ క్వార్టర్‌పై రూ.10, ఆఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదివారం సర్క్యూలర్ జారీ చేసింది. పెరిగిన ధరలు ఈ నెల 19 నుంచి అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, చీప్ లిక్కర్ ధరలు ఎలాంటి మార్పులుండవని పేర్కొంది.
మద్యం ధరల పెంపుపై మందుబాబులో మండిపడుతున్నారు. అయితే, ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం మద్యం ధరలను సవరించినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. వేసవికి ముందు ఫిబ్రవరిలో బీర్ల ధరలు ఒకేసారి 15శాతం పెంచారు. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ నివేదిక మేరకు ఎక్సైజ్‌శాఖ ధరల పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ప్రభుత్వం బీర్ల ధరలను సవరించింది. ఇదిలా ఉండగా.. గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయని ఎక్సైజ్‌శాఖ పేర్కొంది. గత నెలలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.3,272.32 కోట్ల వరకు ఆదాయం వచ్చింది.