Liquor Price | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): మద్యం ప్రియులకు భారీ షాక్ ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ధరల పెంపు పక్కా అని, అయితే అది ఇప్పుడా? లేదంటే కొన్ని రోజుల తర్వాతా? అన్న విషయంలో స్పష్టత లేదన్న చర్చ జోరుగా సాగుతున్నది. కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతులిచ్చి ఆపై మద్యం ప్రియుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన రేవంత్ సర్కారు ఇప్పుడు ధరల పెంపుపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. ధరల పెంపు వల్ల కలిగే లాభనష్టాలను బేరీజు వేస్తున్నట్టు సమాచారం.
ఇప్పుడు రేవంత్ సర్కారు వంతు..
సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతుంటారు. రెండేళ్ల క్రితం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యం ధరలను పెంచగా.. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వంతు వచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు పెంచితే సరారు మీద విమర్శలు వస్తాయనే కోణంలోనూ ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ఎప్పుడు మద్యం రేట్లు పెంచినా.. ప్రస్తుతం లభ్యమవుతున్న అన్ని బ్రాండ్ల లికర్ ధరల మీద 20 నుంచి 25 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇలానే ధరలు పెంచితే ఏటా సరారుకు అదనంగా రూ.3 వేల నుంచి మూడున్నర వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. 2022 మార్చిలో బీఆర్ఎస్ సరార్.. లికర్ రేట్లను పెంచింది. దాని ప్రకారం ఈ ఏడాది మార్చిలోనే ధరలను సవరించాల్సి ఉండగా.. పార్లమెంట్ ఎన్నికల కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తవటంతో ఇప్పుడు ధరలు పెంచే యోచనలో ఉన్నట్టు సమాచారం.
సంక్షేమ పథకాలకు ప్రత్యక్ష వనరు
సరారుకు వస్తున్న ఆదాయ వనరుల్లో మద్యం అమ్మకాలే ప్రధానం. మద్యం విక్రయాల ద్వారా ఏటా సుమారు రూ.37 వేల కోట్ల వరకు సరారుకు ఆదాయం సమకూరుతున్నది. ఇప్పుడీ లక్ష్యాన్ని రూ.47వేల కోట్లకు పెంచినట్టు తెలిసింది. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల సమావేశమైంది. ఏయే శాఖల నుంచి అదనంగా నిధుల సమీకరణ చేయవచ్చన్న చర్చ జరిగిందని, అందులోనే లికర్ రేట్ల పెంపు అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే ఎక్సైజ్‌శాఖ అధికారులు కిందిస్థాయి సిబ్బందికి లక్ష్యానికి అనుగుణంగా టార్గెట్లు ఇచ్చినట్టు సమాచారం. ఒక్కో మద్యం షాపునకు రూ.50 లక్షల లక్ష్యాన్ని నిర్దేశించినట్టు కూడా తెలిసింది. పొరుగు రాష్ట్రం ఏపీలో గత ప్రభుత్వం కొన్ని లికర్ బ్రాండ్లకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడంతో తమకు కావాల్సిన బ్రాండ్ల కోసం ఏపీ ప్రజలు తెలంగాణ సరిహద్దు జిల్లాలకు వచ్చేవారు. ఇప్పుడు అకడ ప్రభుత్వం మారడంతో లికర్ పాలసీ కూడా మారుతుందని, అన్ని బ్రాండ్ల లికర్ విక్రయాలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఏపీ పాలసీని కూడా దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో కూడా మద్యం ధరలను పెంచే అవకాశం ఉంటుందని సమాచారం.