హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఖజానా నింపుకొనేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. యుద్ధం కారణంగా మద్యం ఉత్పత్తి ఖర్చు పెరిగిందని చెప్పి, మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ప్రభుత్వ పెద్దలు, మద్యం కంపెనీలు కూడబలుక్కొని ధరలు పెంచేందుకు కుట్ర చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం ఎప్పుడో రంగం సిద్ధం చేసిందని, కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఇన్నాళ్లూ ఆగిందని చెప్తున్నారు. ఇప్పుడు యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని ధరలు పెంచేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఒకట్రెండు వారాల్లో బీరు, బ్రాందీ, విసీ, రమ్, వైన్, విదేశీ మద్యం సహా మొత్తం 1,032 బ్రాండ్ల మద్యం ధరలు 10 శాతం పెరుగుతాయని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెప్తున్నాయి.
బేసిక్ ధర మీద 12 నుంచి 15 శాతం ధర లు పెంచాలని మద్యం కంపెనీలు (డిస్టిలరీ, బ్రూవరీస్) ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టినట్టు సమాచారం. యుద్ధం కారణంగా గాజు సీసాల తయారీ ముడి సరుకు సరఫరా తగ్గిందని, దీంతో ధరలు పెరిగి, ఉత్ప త్తి ఖర్చు పెరిగిందని పేర్కొన్నాయట! మద్యా న్ని గాజు సీసాల్లో నిల్వ చేసి విక్రయిస్తారని తెలిసిందే. ఈ గాజు తయారీలో నేచురల్ గ్యాస్‌ను వినియోగిస్తారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధం కారణంగా మన దేశానికి నేచురల్ గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో గాజు సీసాల ఉత్పత్తి తగ్గిపోయిందని, దేశీయంగా గాజు సీసాల ఉత్పత్తి, సరఫరా 40 శాతం పడిపోయిందని, ఫలితంగా ఖాళీ సీసాల ధరలు 20 శాతం వరకు పెరిగాయని కంపెనీలు చెప్తున్నాయి.
ఈ మేర కు ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరాయి. కంపెనీలు కోరిందే తడవుగా రెండో ఆలోచన లేకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను ధరల నిర్ణాయక కమిటీకి పంపించినట్టు సమాచారం. తెలంగాణలో నెలకు సగటున 20 లక్షల కేసుల బీరు విక్రయాలు జరుగుతున్నాయి. ప్రతి కేసులో 12 బీర్లు ఉంటా యి. ఈ లెక్కన నెలకు 2.40 కోట్ల బీరు సీసా లు తెలంగాణ ప్రజలు తాగుతున్నారు. బీరు కంపెనీలు నింపే సమయంలో 10 శాతంలోపే కొత్త సీసాలు ఉంటాయి. మిగతా 90 శాతం పాత సీసాలను రీ సైక్లింగ్ చేసి వాడుతుంటా రు. తాగి పడేసిన బీరు సీసాలను సేకరించి, వాటిని కడిగి తిరిగి బీరు నింపి కొత్త స్టిక్కర్ వేసి మార్కెట్లోకి విడుదల చేస్తారన్నమాట. కాబట్టి పశ్చిమాసియా యుద్ధంతో తెలంగాణ లో మద్యం ఉత్పత్తి ఖర్చు పెరుగడం అనేది పె ద్ద బోగస్ అని ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి.
ప్రతి రెండేండ్లకోసారి మద్యం ధరలను సమీక్షించాలనే నిబంధన ఉన్నదని కంపెనీలు చెప్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా రెండేండ్లకోసారి మద్యం ధరలు పెంచలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుడు ఫిబ్రవరిలోనే బీర్ల ధరలను 15 శాతం పెంచింది. ఇప్పుడు సీసాల కొరత, అల్యూమినియం క్యాన్ల ధరలు పెరిగాయంటూ మళ్లీ బీర్లతోపాటు అన్ని బ్రాండ్ల మద్యం ధరలు పెంచాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టారు. వారి డిమాండ్‌ను ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కూడిన ధరల నిర్ణాయక కమిటీ ఏర్పాటు చేసి, వారికి అందజేసింది. ఈ కమిటీ ఈ నెల 4న సమావేశమైనట్టు సమాచారం. త్వరలోనే తుది ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నట్టు తెలిసింది. అంతా సజావుగా సాగితే ఈ నెల మూడో వారంలోనో, ఆ తరువాత గాని ధరలు పెరుగుతాయని ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి.