Telangana | హైదరాబాద్, నవంబర్ 16 ( నమస్తే తెలంగాణ) : తెలంగాణలో మద్యం ఏరులై పారుతున్నది. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వం ప్రజలతో పనిగట్టుకుని మరీ తాగిస్తున్నది. రాష్ట్ర బడ్జెట్లో 12 శాతం ఒక్క మద్యం వల్లనే సమకూరుతున్నది. ప్రపంచంలో విక్రయించే ప్రతి మూడు విస్కీ బాటిళ్లలో హాఫ్ బాటిల్ ఒక్క హైదరాబాద్‌లోనే అమ్ముడవుతున్నదంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తెలంగాణలో మద్యం వినియోగం ప్రమాదకరస్థాయిని దాటిపోయిందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి స్థాయిని మోడరేట్ రిస్క్‌గా భావించవచ్చని బ్రిటిష్ మెడికల్ జర్నల్ పేర్కొన్నది.
డిస్టిలరీలు, బ్రూవరీల కోసం మద్యం ధరలు పెంచబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ధరల నిర్ణయ కమిటీ వేసింది. ఎక్సైజ్ కమిషనర్ సభ్యుడిగా ఉండే ఈ కమిటీ రాష్ట్రంలో మద్యం విక్రయాలు, వినియోగం మీద ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళకు మించి తెలంగాణలో మద్యం విక్రయిస్తున్నట్టు అందులో ఆ నివేదికలో కమిటీ పేర్కొన్నది. మద్యం వినియోగంతోపాటు ఆదాయంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్టు తెలిపింది. ఆ నివేదిక ప్రకారం, తెలంగాణ జనాభా 3.5 కోట్లు. ఈ ఏడాది నవంబర్ నాటికి రూ. 35,589 కోట్ల మద్యం విక్రయించారు. ఈ లెక్కన తలసరి మద్యం వినియోగం 9 లీటర్లు. బీర్ల వినియోగం 10.7 లీటర్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ జనాభా 4.93 కోట్లు. నవంబర్ నాటికి మద్యం ద్వారా రూ. 23,804 కోట్ల దాయం సమకూరింది. తలసరి మద్యం వినియోగం 6.04 లీటర్లు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) ఇటీవల వెల్లడించిన గణాంకాల్లోనూ మద్యం వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్టు తెలిపంది. జాతీయ తలసరి మద్యం వినియోగం 5.06 శాతం కాగా, దేశంలో మద్యం తాగే వారి సగటు 9.9 శాతంగా ఉంది. తెలంగాణలో ఇది 10 శాతం అదనంగా నమోదైంది. రాష్ట్రంలో నిత్యం మద్యం తాగుతున్న వారి సగటు 19 శాతంగా ఉందని ఎన్ఎఫ్హెచ్ఎస్-5 సర్వే వెల్లడించింది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మద్యం తాగుతున్న వారి సంఖ్య 3 శాతం ఎక్కువగా ఉన్నట్టు వివరించింది. కొత్తగా మద్యానికి అలవాటు పడుతున్న వారి సంఖ్య పట్టణ ప్రాంతాల్లో తగ్గుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పెరుగుతుండడంపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతున్నది.
గ్లోబల్ స్టేటస్ రిపోర్టు ప్రకారం దేశంలోని మద్యం విక్రయాల్లో 45 శాతం ఐదు దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాల్లోనే జరుగుతున్నాయని స్పష్టం చేసింది. భారత్‌లో ఈ-కామర్స్, హోం డెలివరీలకు అనుమతి లేకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో 19.9 శాతం మంది మద్యం తాగుతున్నట్టు తెలిపింది. ప్రపంచంలో అమ్ముడవుతున్న ప్రతి రెండు విస్కీ బాటిళ్లలో ఒకటి మన దేశంలోనే అమ్ముడుపోతోందని, అందులోనూ దక్షిణాది రాష్ర్టాలదే సింహభాగమని నివేదిక వివరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో 12 శాతం మద్యం అమ్మకాలపై పన్నుల ద్వారానే సమకూరుతున్నట్టు క్రిసిల్ పరిశోధన విభాగం లెక్కగట్టింది.
మద్యం తాగుతున్న వారిలో అత్యధిక వాటా పేదలదేనంటూ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే దిగ్భ్రాంతికర విషయం వెల్లడించింది. తెలంగాణలో 43.6 శాతం మంది పురుషులు, 6.7 శాతం మంది మహిళలు మద్యం తాగుతున్నట్టు తెలిపింది. పల్లెల్లో మద్యం దుకాణాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని ప్రోత్సహించడమే కాక, దానిమీద వచ్చే ఆదాయంపైనే దృష్టిసారించింది. ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు విధించి మరీ బలవంతంగా మద్యం విక్రయిస్తున్నది. ఎక్సైజ్ అధికారులు చెప్తున్నదాని ప్రకారం రాష్ట్రంలో 1.75 లక్షల బెల్టు దుకాణాలు ఉన్నాయి.