హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): గోవా, ఢిల్లీ నుంచి తరలిస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్)కు చెందిన 1188 మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టుబడిన మద్యం ధర సుమారు రూ.25లక్షలు ఉంటుందని వెల్లడించారు.
ఈనెల 3నుంచి 9వరకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌డ్రైవ్ నిర్వహించినట్టు స్పష్టంచేశారు. ఈ డ్రైవ్‌లో 33మందిని అరెస్టు చేయడంతోపాటు, 19 వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. అలాగే మద్యం బాటిళ్లతోపాటు 22లీటర్ల బీరు బాటిళ్లు, 21లీటర్ల దేశీదారు లికర్ను సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్టీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ టీమ్‌లతోపాటు ఎక్సైజ్స్టేషన్ సిబ్బంది పాల్గొన్నట్టు వెల్లడించారు.
మొత్తం 64కేసులు నమోదు చేశామని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానంతో బ్యాగులను తనిఖీ చేసి.. 40 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. గోవా నుంచి వచ్చిన వాసోడిగామా రైలులో ఎస్టీఎఫ్ టీమ్‌లతోపాటు, వికారాబాద్ ఎక్సైజ్, డీటీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేపట్టగా, నాన్‌డ్యూటీ పెయిడ్ లికర్ మద్యం పట్టుబడిందని పేర్కొన్నారు.