హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో రాబోయే మూడ్రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బుధవారం హైదరాబాద్, రంగారెడ్డితోపాటు పలు జిల్లాల్లో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించినట్టు పేర్కొన్నది. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో 3.49 సెం.మీ కురవగా, హైదరాబాద్ జిల్లా గోల్కొండలో 2.82, మేడ్చల్ మల్కాజిగిరిలో 2.22, రంగారెడ్డి జిల్లా గండిపేటలో 1.88 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్జ్ జారీ చేసినట్టు వెల్లడించింది.
గురువారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, యాదాద్రి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ చేసినట్టు తెలిపింది. ఇదిలా ఉండగా, ఒకవైపు పలు జిల్లాల్లో వర్షాలు కురవగా, మరికొన్ని జిల్లాల్లో మాత్రం గరిష్ఠ ఉష్ణోగత్రలు నమోదయ్యాయని పేర్కొన్నది. ముఖ్యంగా ఆదిలాబాద్లో 40.3, భద్రాది కొత్తగూడెంలో 36.8, మహబూబ్నగర్లో 37.6, ఖమ్మంలో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది.