Telangana | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన, ఉచిత విద్యుత్తు సరఫరా కాంగ్రెస్ పాలనలో ఉత్తదే అయ్యింది. సాగుకు పవర్ కట్స్ మొదలయ్యాయి. 14 గంటలకు మించి కరెంట్ అందడం లేదని అధికార వర్గాలే చెప్తున్నాయి. అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నదని అంటున్నారు. మొన్నటిదాకా 16 గంటలు అందగా, ఇప్పుడది 14 గంటలకు పడిపోయిందని చెప్తున్నారు. ఇందుకు సబ్స్టేషన్ల లాగ్‌బుక్‌లే సాక్ష్యంగా నిలుస్తున్నాయని అంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఓ సబ్‌స్టేషన్‌లో రాత్రి ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకే కరెంట్ సరఫరా చేస్తున్నారని, ఆ తర్వాత సింగిల్ ఫేజ్‌కు మారుస్తున్నారని పేర్కొన్నారు. కరెంట్ సరఫరాకు షెడ్యూల్ రూపొందించి ఫలానా సమయంలో త్రీఫేజ్‌కు మార్చండి, ఫలానా సమయంలో త్రీఫేజ్ తీసేయండి అంటూ ఆదేశాలిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాట్సాప్ సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ గద్దెనెక్కే సమయానికి 24 గంటలు అందిన కరెంటు ఇప్పుడు 14 గంటలకే పరిమితమైంది. దీన్నిబట్టి భవిష్యత్తు ఎంత దుర్భరంగా ఉంటుందో ఆలోచించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో పీక్ డిమాండ్ ఉదయం, సాయంత్రం వేళల్లో నమోదవుతున్నది. ముఖ్యంగా ఉదయం 6-9 గంటల మధ్య, సాయంత్రం 6-9 గంటల మధ్య గరిష్ఠ డిమాండ్ నమోదవుతున్నది. ఈ సమయంలో చాలా ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్తు ఇవ్వడంలేదు. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉదయం 7-8 గంటల ప్రాంతంలో త్రీఫేజ్ కరెంట్ కట్ చేస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. సాయంత్రం 4:30 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో త్రీఫేజ్ కరెంట్ కట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ సయమంలో త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వాల్సి వస్తే.. బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కరెంట్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కాబట్టే పీక్ సమయంలో త్రీఫేజ్ విద్యుత్తు ఇవ్వడంలేదని అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది యాసంగి ఆరంభం నుంచీ వ్యవసాయ రంగానికి పగటిపూటే విద్యుత్తు ఇస్తున్నారని, రాత్రిపూట కోత పెడుతున్నారని రైతులు చెప్తున్నారు. బహిరంగ మార్కెట్లో సోలార్ విద్యుత్తు అందుబాటులో ఉన్నప్పుడే త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేస్తున్నారని సమాచారం. అంటే పొలాలు ఎండినా, రైతన్న అల్లాడుతున్నా తమకు అనవసరమని, డబ్బులు ఆదా చేయడం, ఖర్చులు తగ్గించుకోవడమే మఖ్యమన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని నిపుణులు మండిపడుతున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ పీక్ సమయంలో యూనిట్‌కు ఎంతైనా వెచ్చించి బహిరంగ మార్కెట్లో ఎక్కడ దొరికినా కరెంట్ కొనుగోలు చేసి రైతాంగానికి అందించిందని గుర్తుచేస్తున్నారు. కోతల్లేని నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసిందని, పవర్ బ్యాంకింగ్ (స్వాపింగ్) విధానంలో మన దగ్గర ఉత్పత్తి అయిన విద్యుత్తును ఇతర రాష్ర్టాలకు ఇచ్చి, మనకు అవసరమున్నప్పుడు ఇతర రాష్ర్టాల నుంచి తీసుకునే విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ పాలనలో కోతలు మొదలయ్యాయని విమర్శిస్తున్నారు.
రాష్ట్రంలో సాగునీటిపారుదలశాఖ పలు మేజ ర్ ప్రాజెక్టులు చేపట్టింది. లిఫ్ట్ స్కీమ్‌లు ఏర్పా టు చేసింది. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, దేవాదుల, కల్వకుర్తి, రాజీవ్‌భీమా, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, గూడెం ఇలా మొత్తంగా 111కు పైగా మేజర్ పంపింగ్ స్టేషన్లు, దాదాపు 617 ఐడీసీ లిఫ్ట్ స్కీమ్‌లు కొనసాగుతున్నాయి. ఆయకట్టుకు నీరందించడంలో ఆయా ప్రాజెక్టులదీ కీలకపాత్ర. ఆయా పంప్‌హౌస్‌ల నిర్వహణకు ట్రాన్స్ కో ప్రత్యేకంగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసింది. ట్రాన్స్మిషన్ లైన్లు నెలకొల్పింది. ఆయా ప్రాజెక్టులకు విద్యుత్తు సరఫరా బిల్లులే దాదాపు రూ.27,027 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అదీగాక పంపింగ్ స్టేషన్ల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌కు సంబంధించి రూ.1,745 కోట్ల బకాయిలున్నాయి. ఇవీగాక ఇప్పటికే పూర్తయిన లిఫ్ట్ స్కీమ్‌లకు సంబంధించి పనులకు రూ.863.51కోట్లు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులకు సంబంధించి పంప్‌హౌస్‌ల నిర్మాణం, కరెంటు సరఫరా కోసం రూ.3,900.81కోట్లు, మొత్తంగా రూ.4,764.32 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. మొత్తంగా అన్నీ కలిపి రూ.33,653 కోట్ల నిధులను ట్రాన్స్‌కోకు ఇరిగేషన్‌శాఖ చెల్లించాల్సి ఉన్నది. అందులో అత్యవసరంగా కనీ సం రూ.500 కోట్లయినా చెల్లించాలని ట్రాన్స్ కో సుదీర్ఘకాలంగా ఇరిగేషన్ శాఖకు, ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెడుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రాన్స్‌కో 24 గంటల కరెంట్ సరఫరా నిలిపివేసింది. పగటిపూట మాత్రమే కరెంటును ఇవ్వగలమని తేల్చి చెప్పింది. బకాయి బిల్లులను చెల్లిస్తే తప్ప కరెంటు ఇవ్వబోమని ఇరిగేషన్‌శాఖకు తెగేసి చెప్పింది.
గోదావరి బేసిన్లో సమ్మక్కసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలాశయాల్లో, కృష్ణా బేసిన్లోనూ జూరాల, శ్రీశైలం, సాగర్‌తోపాటు అన్ని మీడియం ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీటినిల్వలు ఉన్నాయి. ఆయా జలాశయాల ఆధారంగా పలు లిఫ్ట్ పథకాలు కొనసాగుతున్నాయి. కానీ ప్రస్తుతం ఆయా లిఫ్ట్ పథకాలను వినియోగించని, నీటి ఎత్తిపోతలను కొనసాగించలేని దుస్థితి నెలకొన్నది. ట్రాన్స్‌కో పగటి పూట కరెంటును నిలిపివేయడమే అందుకు కారణం. దేవాదుల పథకానికీ ఇదే పరిస్థితి. రిజర్వాయర్లలో నీరున్నా కూడా సరఫరా చేయలేకపోతున్నామని అధికారులు వాపోతున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకున్నా కేవలం పగటి పూట, అది కూడా కొన్ని గంటలు మాత్రమే కరెంటు సరఫరా చేస్తున్నది. ఫలితంగా డిమాండ్ మేరకు, పంప్‌హౌస్‌ల సామర్థ్యం మేరకు నీటిని ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడింది. వెరసి కీలకదశలో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ట్రాన్స్‌కో అధికారులకు విన్నవించినా కూడా కరెంటు సరఫరాకు ససేమిరా అంటున్నారని ఇంజినీర్లు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం. ప్రభుత్వ స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు 24 గంటల కరెంట్ ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు పగటిపూటే విద్యుత్తునిస్తాం.. అప్పుడే నడుపుకోవాలంటూ ఇటీవలే స్పష్టంచేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖకు ట్రాన్స్‌కో లేఖ రాసింది. ‘ఇరిగేషన్‌శాఖకు 24 గంటల కరెంట్ ఇవ్వాలంటున్నారు. అలా ఇవ్వాలంటే మేం విద్యుత్తు ఎక్స్చేంజ్లో అధిక ధరకు కొనుగోలు చేయాలి. దీంతో మేం మోయలేనంత ఆర్థిక భారం పడుతున్నది. అదీగాక విద్యుత్తు బిల్లులు రూ.33,653 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే రూ.813 కోట్ల చెల్లింపునకు టోకెన్ ఆర్థికశాఖలో పెండింగ్‌లో ఉన్నది. ఇదే విషయంపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. మరోవైపు పగటి పూట సౌర విద్యుత్తు చౌకగా లభిస్తుంది. కాబట్టి మీరు అడిగినట్టు 24 గంటల కరెంట్ ఇవ్వలేం. పగటిపూట సోలార్ విద్యుత్తు లభ్యమయ్యే సమయంలోనే ఇస్తాం’ అంటూ ఇరిగేషన్‌శాఖ ఈఎన్సీకి ట్రాన్స్‌కో లేఖ రాసింది. వ్యవసాయ రంగానికి కూడా పగటిపూటే విద్యుత్తునందిస్తున్నారని, రాత్రిపూట పీక్ డిమాండ్ సమయాల్లో కోత పెడుతున్నారని అధికారులు చెప్తున్నారు.
2014లో రాష్ట్ర ఆవిర్భావ సమయానికి వ్యవసాయ రంగం, విద్యుత్తు రంగం సంక్షోభంలో ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం సవాల్‌గా స్వీకరించింది. మూడున్నరేండ్లల్లోనే రాష్ట్రం మొత్తం 24 గంటల కరెంట్ సరఫరా చేసింది. దేశంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతికెక్కింది. ఏటా ఉచిత విద్యుత్తు సబ్సిడీ కింద రూ.11,500 కోట్లను డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అందించింది. 2014లో ఉచిత వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య 19.03 లక్షలు మాత్రమే ఉండగా, 2023 కల్లా ఈ కనెక్షన్ల సంఖ్య 27.49 లక్షలకు చేరింది. అయినా ఏ మాత్రం వెనుకంజ వేయకుండా నాణ్యమైన విద్యుత్తు అందించింది. రైతాంగంలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

‘రైతన్న రందిబాపాలె.. రాజును చేయాలె’ ఇదే ఏకైక ఎజెండా. ఇందుకోసం వేల కోట్లు ఖర్చు చేసేందుకూ వెనుకాడలేదు. విద్యుత్తు వ్యవస్థలను పటిష్టం చేయడంలో రాజీపడలేదు. ఫలితంగా వ్యవసాయానికి పగలూరాత్రి తేడాలేకుండా 24 గంటల విద్యుత్తు అందింది. రైతులు పుట్ల కొద్దీ పంటలు పండించారు. ‘మేం తెలంగాణ వడ్లు కొనలేం బాబోయ్’ అంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది.
‘బడాయిలు కొట్టాలె.. బకాయిలు పెట్టాలె’ అన్నట్టుగా నడుస్తున్నది. రైతులకు నాణ్య మైన, నిరంతర విద్యుత్తు అంది స్తామన్న హామీ గాల్లో కలిసింది. అధిక ధరలు ఉన్నప్పుడు బహిరంగ మార్కెట్లో విద్యుత్తు కొనుగోలు చేయవద్దని, తక్కువ ధరకు.. అది కూడా సౌర విద్యుత్తు మాత్రమే కొంటామని నిర్ణయించింది. సౌర విద్యుత్తు దొరకని సమయాల్లో కరెంట్ ఇవ్వలేమని, పొలాలు పారక పోయినా, పంటలు ఎండినా సంబంధం లేదని చేతులు దులుపుకొన్నది.