ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.80కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టింది. జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి శివారులోని మూడు రైస్‌మిల్లులపై రాష్ట్ర విజిలెన్స్ బృందం చేసిన దాడుల్లో ఇది బట్టబయలైంది. కానీ, దీని విలువ రూ.వంద కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం పక్కదారి పట్టించిన యజమానులపై పౌర సరఫరాల శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడం బాగోతాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇలానే జగిత్యాల జిల్లాలో దాదాపు రూ.200 కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే రాజకీయ ఒత్తిడితోనే బడా మిల్లర్లు తప్పించుకున్నట్టున్నారనే విమర్శలున్నాయి. చిన్న రైస్‌మిల్లర్లను ముక్కుపిండి బకాయిలు వసూలు చేసిన అధికారులు.. పెద్ద రైస్‌మిల్లర్లు, పరపతి కలిగిన రైస్‌మిల్లర్లను మాత్రం చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
జగిత్యాల, జూలై 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా రైస్‌మిల్లుల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, సీఎంఆర్‌కు సంబంధించి ధాన్యం పక్కదారి పడుతున్నదని, కోట్ల రూపాయల స్కాం నడుస్తున్నదనే ఆరోపణల నేపథ్యంలో రా్రష్ట్ర విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి గ్రామ పరిధిలో ఉన్న మూడు రైస్ మిల్లులపై ఆకస్మిక దాడులు చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు తనిఖీలు చేసి, దాదాపు 34వేలకుపైగా మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్టు గుర్తించారు. లక్ష్మీబాలాజీ, శ్రీఅభయాంజనేయసాయి, లక్ష్మీగణపతి రైస్‌మిల్లులకు సంబంధించి పౌర సరఫరాల శాఖ 2022 నుంచి సీజన్ల వారీగా కేటాయించిన ధాన్యం, అలాగే మిల్లుల యజమానులు సీఎంఆర్‌గా పౌరసరఫరాల శాఖకు పెట్టిన బియ్యం విలువలను పరిశీలించారు. అలాగే 2022-23కు సంబంధించిన టెండర్ ప్యాడీ మిల్లులో ఉన్నదా..? లేదా అన్నదాన్ని గమనించారు. రూ.39కోట్ల విలువైన 17వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్టు గుర్తించారు. అలాగే 2024 నుంచి మూడు సీజన్లకు సంబంధించి ధాన్యం, మిల్లింగ్ చేసి పెట్టిన బియ్యం, నిల్వ ఉండాల్సిన ధాన్యం, క్షేత్రస్థాయిలో నిల్వ ఉన్న ధాన్యం లెక్కలను పరిశీలించారు. ఇప్పటి వరకు సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యంలో రూ.41కోట్ల విలువైన 17,400 మెట్రిక్ టన్నులు పక్కదారి పట్టిందని అంచనా వేశారు. మొత్తంగా రూ.80 కోట్ల విలువైన ధాన్యం మూడు మిల్లుల పరిధి నుంచి పక్కదారి పట్టినట్టు గుర్తించి, ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పౌర సరఫరాల శాఖ అధికారులకు, కలెక్టర్‌కు అందజేశారు. అయితే నిబంధనల ప్రకారం టెండర్ ప్యాడీకి సంబంధించి క్వింటాల్‌కు రూ.2230 చొప్పున లెక్క కట్టిన అధికారులు, ప్రస్తుత సీజన్లకు రూ.2380 చొప్పున లెక్కించి విలువను గుర్తించారు. సీఎంఆర్‌కు సంబంధించి ఇచ్చిన మిల్లింగ్ డబ్బులు, ఇతర అవస్థాపన ఖర్చులతో కలిపి క్వింటాల్ ధర అధికంగా ఉంటుందని, ఆ లెక్కన పరిశీలిస్తే రూ.వంద కోట్లకు పైగానే స్కాం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
విజిలెన్స్ అధికారులు దాదాపు 30 గంటల పాటు తక్కళ్లలపల్లి పరిధిలోని మూడు రైస్ మిల్లుల్లో తనిఖీలు చేశారు. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చి సోదాలు మొదలు పెట్టి.. క్షుణ్ణంగా పరిశీలించారు. బుధవారం రాత్రి మొత్తం తనిఖీలు చేసినా.. గురువారం ఉదయం వరకు ధాన్యం పక్కదారిపై ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. అయితే గురువారం రాత్రి వరకు సైతం అధికారులు వివరాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. కాగా, తనిఖీల సమయంలో మిల్లుల యజమానులు సహకరించని విషయాన్ని కలెక్టర్‌తోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు సైతం నివేదించినట్టు తెలిసింది. మిల్లుల్లో పనిచేసే హమాలీలు ఎవరు సహకరించకపోవడంతో తనిఖీలకు చాలా సమయం పట్టినట్టు అధికారులు చెబుతున్నారు. విజిలెన్స్ ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం అకస్మాత్తుగా రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా పౌర సరఫరాల శాఖ అధికారులు సైతం అక్కడి చేరుకున్నట్టు తెలుస్తున్నది. గురువారం రాత్రి వరకు లెక్కలు పూర్తి చేసి, శాఖాపరమైన నివేదికను రూపొందించి కలెక్టర్ అందించారు. కాగా, ధాన్యం పక్కదారి పట్టడంపై శుక్రవారం సాయంత్రం జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జగిత్యాల జిల్లాలోని కొందరు రైస్‌మిల్లర్లు ఇంకా పెద్ద మొత్తంలో టెండర్ ప్యాడీకి సంబంధించిన డబ్బును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్నది. దాదాపు రూ.200 కోట్ల బకాయిలు ఉన్నట్టు తెలుస్తున్నది. చిన్న రైస్‌మిల్లర్ల వద్ద నుంచి ముక్కుపిండి బకాయిలు వసూలు అధికారులు.. పెద్ద రైస్‌మిల్లర్లు, పరపతి కలిగిన రైస్‌మిల్లర్లను మాత్రం చూసీచూడనట్టు విడిచిపెడుతున్నారని కొందరు రైస్‌మిల్లర్లు ఆరోపిస్తున్నారు. జగిత్యాల- కరీంనగర్ రూట్లో పెద్ద ఫంక్షన్‌హాల్, పలు పెట్రోల్‌బంక్‌లు కలిగి ఉన్న రైస్‌మిల్లరు పది నుంచి పదిహేను కోట్ల రూపాయల వరకు బకాయి ఉన్నారని చెబుతున్నారు. అలాగే పక్క జిల్లా నుంచి గతంలో శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఒక రైస్‌మిల్లర్ అయితే ఏకంగా ముప్పై నలభై కోట్ల రూపాయల వరకు బకాయి పడినట్టు సమాచారం. అలాగే మున్సిపల్ చైర్మన్‌గా గతంలో పనిచేసిన ఒక రైస్‌మిల్లర్ సైతం పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నట్టు తెలిసింది. ఇంకా కొందరు రాజకీయ పలుకుబడి కలిగిన రైస్‌మిల్లర్లు మూడేళ్ల క్రితం నాటి టెండర్ ప్యాడీ డబ్బులు సైతం చెల్లించనట్టు తెలుస్తున్నది. టెండర్ ప్యాడీ అనంతరం సీజన్లకు సంబంధించిన ధాన్యం నిల్వలోనూ పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని రైస్‌మిల్లర్లే ఆరోపిస్తున్నారు. చిన్న రైస్‌మిల్లర్లు తప్పిదారి ఒకటి, రెండు కోట్లు బకాయిలు ఉంటే అధికారులు పట్టుబట్టి వసూలు చేస్తారని, వారికి సీఎంఆర్ కేటాయింపులు చేసేందుకు సైతం ఇష్టపడరని చెబుతున్నారు. అదే వందల కోట్ల బకాయిలు పెట్టి, ధాన్యం పక్కదారి పట్టిస్తున్న మిల్లర్లకు మాత్రం యథేచ్ఛగా సీఎంఆర్ కేటాయింపులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఒకటీ రెండు రైస్‌మిల్లుల తనిఖీలతో సరిపెట్టవదని, బకాయిలున్న అన్ని రైస్‌మిల్లుల్లో తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.