Priyanka Gandhi : ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి కూడా సీఈసీ (CEC) జ్ఞనేష్ కుమార్ (Gyanesh Kumar) వాటిని అనుమతిస్తే అది దేశ ద్రోహం, రాజ ద్రోహమే అవుతుందని కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకా గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) వ్యాఖ్యానించారు. వాయనాడ్ (Wayanad) లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ అయిన ఆమె ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న వారిని కచ్చితంగా నిలదీయాలని అన్నారు.
ఇక్కడి నిలంబూర్‌లో విలేకరులతో మాట్లాడిన ప్రియాంకాగాంధీ.. భారత ఎన్నికల సంఘం వ్యవహారాల్లో చోటుచేసుకుంటున్న పక్షపాతం, అన్యాయం గురించి తన సోదరుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరంతరం గళమెత్తుతున్నారని అన్నారు. ఆయన అనేక సమస్యలను పదేపదే ప్రస్తావించారని, ఇప్పుడు స్వయంగా ఎన్నికల కమిషనర్లు కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు కొన్ని సమస్యలను వివరించినట్లు వార్తా మాధ్యమాల్లో కూడా వెల్లడవుతోందని చెప్పారు.
ఓట్లచోరీ అనేది మన ప్రజాస్వామ్యానికి అత్యంత తీవ్రమైన సమస్య అని తాను భావిస్తున్నానని ప్రియాంకాగాంధీ అన్నారు. ఎన్నికలే సక్రమంగా లేకపోతే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగకుండా ఏ విధంగానైనా అక్రమాలకు తావిచ్చేలా ఉండి, అందులో భారత ఎన్నికల సంఘం సహకరిస్తుంటే, ఎన్నికల కమిషనర్‌కు ఆ విషయం తెలిసి ఉండి కూడా దానిని జరగనిస్తుంటే అది ప్రజాస్వామ్యంపై జరిగిన అత్యంత తీవ్రమైన దాడి అవుతుందని వ్యాఖ్యానించారు.