నెట్వర్క్ మహబూబ్‌నగర్, జూలై 31 : తెలంగాణ ఉద్యమంలో నికార్సైన ఉద్యమకారుడిగా పోరాడి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి నుంచి ఉద్యమానికి మూల స్తంభంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి నిలిచారని మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. ప్రజల మనస్సులో పెద్దన్నగా చెరగని ముద్ర వేసుకొన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మృతి బీఆర్ఎస్ నేతలను తీవ్రంగా కలిచివేసిం దన్నారు.
శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల గులాబీ పార్టీ వ్రేణులు సంతాపం తెలియజేశారు. వనపర్తిలో పెద్ది చిత్రపటానికి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, నాయకులు నివాళులర్పించారు. అలాగే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డితోపాటు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వనపర్తి, జూలై 31(నమస్తే తెలంగాణ) : ప్రజా సేవకు అంకితమైన నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. దవాఖానలో అనారోగ్యంతో పోరాడి గెలుస్తాడనుకుంటున్న తరుణంలో ఆయన్ను మత్యువు కబళించిందని ఆవేదన చెందారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో పెద్ది మృతిపై బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరంజన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో నికార్సైన ఉద్యమకారుడిగా పోరాడిన వీరుడన్నారు. ఉ మ్మడి వరంగల్ జిల్లాలో తొలినాళ్ల నుంచి ఉద్యమానికి మూల స్తంభంగా నిలబడ్డాడన్నారని గుర్తు చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితులొచ్చినా.. చంద్రబాబు, వైఎస్సార్ సమైక్య పాలనలోని ఇబ్బందులను సైతం మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని కేసీఆర్‌కు అండగా నిలబడ్డ నేత అని కొనియాడారు.
నర్సంపేట ప్రాంతాల్లో పండించే పంటలకు నష్టం కలిగినప్పుడు కేసీఆర్‌ను ఒప్పించి తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆ ప్రాంత రైతులకు ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం అందించేలా కృషి చేశాడన్నారు. ప్రజల కోసం పని చేయాలన్న తపన ఉన్న నాయకుల్లో ప్రథమశ్రేణి నేతగా నిలిచాడన్నారు. ఆయన ఆశయ సాధనకు నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాల్సిన అవసరం ఉ ందన్నారు. ఆయన లేని లోటు పార్టీకి పూడ్చలేనిదని, ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలని సానుభూతి, సంతాపాన్ని లిపా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నా యకులు వాకిటి శ్రీధర్, రమేశ్‌గౌడ్, మహేశ్వర్‌రెడ్డి, అశోక్, పరంజ్యోతి, రఘువర్ధన్‌రెడ్డి, ధర్మానాయక్, గులాంఖాదర్, నర్సింహ, మాధవరెడ్డి, హుస్సేన్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, నాగన్నయాదవ్, రాము, గిరి, ఆరీఫ్, పాషా, లక్ష్మణ్‌గౌడ్, గన్నోజు, మోహన్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి సంతాపం తెలిపారు. వనపర్తిలోని తెలంగాణ భవన్లో పెద్ది చిత్రపటానికి పూలమాల వేసి ఆ యన నివాళులర్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ముందుకు నడిపించాడని, పార్టీ కోసం నిరంతరం శ్రమించే స్వభావం ఉన్న వ్యక్తి ఆయనన్నారు. సుదర్శన్‌రెడ్డి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో గోవర్దన్‌రెడ్డి, రావుల విజయ్, నర్సింహ, నాగరాజు, రఘు, ఉద్యమకారులు ఉన్నారు.
జడ్చర్లటౌన్, జూలై 31 : వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటు అని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన నికార్సైన ఉద్యమకారుడిగా పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి ఎంతో బాధాకరమన్నారు. ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఉద్యమ జ్ఞాపకాలను మాజీ మంత్రి గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు.
నాగర్‌కర్నూల్, జూలై 31 : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. పెద్ది చికిత్స పొందుతుండడంతో కోలుకొని తిరిగి ప్రజల మధ్యకు వస్తారనే ఆశతో ఎదరు చూశామని, కానీ ఆయన మన మధ్య లేరన్న వార్త ఎంతో బాధ కలిగిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని, ఉద్యమ ఆశయాలను జీవితాంతం నమ్మి, ప్రజల పక్షాన నిలబడి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడు సుదర్శన్‌రెడ్డి అని గుర్తు చేశారు. ఆయన మరణం పార్టీతోపాటు తెలంగాణ సమాజానికి తీరనిలోటన్నారు. ఆయన చూపిన నిబద్ధత, సేవా తపన, ఉద్యమ స్ఫూర్తి పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
నారాయణపేట, జూలై 31 : వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఛాతినొప్పితో అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని యశోధ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు.