కవాడిగూడ, నవంబర్ 1: బీసీలకు జరుగుతున్న అన్యాయానికి చరమగీతం పాడుతామని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి చెప్పారు. గడచిన తరాలు అనుభవించిన అన్యాయం అణచివేత భవిష్యత్తు తరాలకు జరగకుండా ప్రతిఒక్కరూ చరిత్రాత్మక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తరతరాలుగా అన్యాయానికి గురవుతున్న జాతికి న్యాయం జరిగేంత వరకూ అవిశ్రాంతంగా పోరాడాలని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద 24 గంటల దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో మధుసూదనాచారితోపాటు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి రాజేశంగౌడ్, జైహింద్‌గౌడ్, గుజ్జకృష్ణ తదితర బీసీ సంఘాల నాయకులు పాల్గొని మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో అధికార మార్పిడి జరిగింది తప్పితే బీసీలకు ఎన్నడూ న్యాయం జరగలేదని చెప్పారు. ఏ రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా చట్టసభలో ప్రాతినిధ్యం లేని అగ్రకులం ఒక్కటైనా ఉన్నదా అని ప్రశ్నించారు. బీసీలను మాత్రం రెండోశ్రేణి పౌరులుగా, ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారని అన్నారు. ఇందుకు ఆధిపత్య కులాలు కొంత కారణమైతే మన స్వయంకృతాపరాధం కూడా ఉన్నదని చెప్పారు. దేశంలోని బీసీలందరినీ మేల్కొలిపేందుకు ఈ దీక్ష ఒక పునాదిరాయి కావాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న బీసీలు.. శాసించి అధికారం అందిపుచ్చుకోకుండా ఎవరో హామీ ఇచ్చిన 42శాతం రిజర్వేష న్ల కోసం ఆందోళన కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. గంజిలో ఈగలా చూస్తున్న పాలకవర్గాలను గంజి కన్నా హీనంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీసీలకు ఏ రోజూ సముచిత గౌరవం దక్కలేదన్నారు. చైతన్యవంతమైన నేటి సమాజంలో బీసీలు ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే అవసరం లేదని చెప్పారు. రాజ్యాధికారంలో వాటా దక్కించుకున్నప్పుడే బీసీలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని తెలిపారు.
బీసీలు ఐక్యతను పెంచుకోవాలని, లక్ష్యాన్ని సాధించుకునేందుకు బీసీ ఉద్యమాన్ని ప్రజాఉద్యమంగా మార్చి ముందుకు తీసుకువెళ్లాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ దానిని అమోదించాల్సిన అధికారం పార్లమెంటుకే ఉందని చెప్పారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కావాలని అన్నారు. జాతీయ స్థాయిలో జనగణన జరగబోతున్నదని అందులో కులగణన కూడా చేస్తారని తెలిపారు. దీంతో బీసీలు ఎంతో తేలిపోతుందని తెలిపారు.
బీసీలకు రాజకీయ శత్రువులు తెలంగాణ రెడ్డోళ్లని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలన్న డిమాండ్‌తో ఓవైపు బాపూఘాట్ వద్ద బీసీ కమిషన్ దీక్ష చేపడితే మరోవైపు ఇందిరాపార్కు వద్ద ఎర్ర సత్యనారాయణ నిరాహార దీక్ష చేస్తున్నారని చెప్పారు. కోర్టులను అడ్డం పెట్టుకొని బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్రలు చేస్తున్నారని మండపడ్డారు. ఆరు శాతం ఉన్న రెడ్లు 60 శాతం ఉన్న బీసీలకు సవాలు విసురుతున్నారని అన్నారు. నోటి కాడి బుక్క గుంజుకున్నోడిని మనసులో పెట్టుకోవాలని రాజకీయ శత్రువులైన వారిని రాజకీయంగానే భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరాహారదీక్షలో బీసీ నాయకులు వీజీఆర్ నారగోని, దుర్గయ్యగౌడ్, వెంకటస్వామి, వెంకట్రాములు పాల్గొన్నారు.