తిరువనంతపురం, మార్చి 18: శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కేరళలో రాజకీయ వేడి రాజుకున్నది. ఏప్రిల్ 9న ఎన్నికలు జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడుతాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నది. తాము చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నది. అధికార పార్టీపై ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలని విపక్ష యూడీఎఫ్ సిద్ధపడుతున్నది. ఇక బీజేపీ తన ఉనికిని నిలుపుకొనే ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా సామాజిక భావాల నుంచి ఆర్థిక అంశాల వరకు వివిధ అంశాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నది.
దేశంలోని పలు రాష్ర్టాల్లో ఉనికి కోల్పోయిన వామపక్షాలకు ఇక్కడ అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యతకత ఏర్పడింది. గత 10 ఏండ్లుగా ప్రతిపక్షంగా మిగిలిపోయిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈసారి అధికారాన్ని దక్కించుకోవడానికి అర్రులు చాస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ ఉనికి కూడా దేశంలో మూడు రాష్ర్టాలకే పరిమితం కావడంతో తమ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక బీజేపీ అయితే తొలిసారిగా కొన్ని సీట్లయినా దక్కించుకుని కేరళలో బోణి కొట్టాలని ఆశిస్తున్నది. బీజేపీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుపైనే ఆశలు పెట్టుకుంది.
కేరళలో అధికార ఎల్డీఎఫ్నకు ప్రభుత్వ అనుకూల గాలి వీస్తున్నదని రాజకీయ విశ్లేషకుడు మాథ్యూస్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రంలోని శబరిమల దేవాలయ అంశం ఒక వర్గాన్ని తీవ్రంగా బాధపెట్టిందని, ఇక ద్రవ్యోల్బణం, ధరలు వంటి అంశాలు ఇతర సామాజిక వర్గాలతో పాటు క్రైస్తవులు, మైనారిటీలను ప్రభావితం చేస్తాయని, వారి ఓట్లు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. ఈ పదేండ్ల కాలంతో తాము రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని చాటుకుంటూ అధికార పార్టీ ‘ఎల్డీఎఫ్ కాకుండా ఇక్కడ ఎవరు ఉన్నారు?’ నినాదంతో ఇప్పటికే విస్తృతంగా ప్రచారాన్ని ప్రారంభించింది. కేరళ అసెంబ్లీలో 140 సీట్లు ఉండగా, 2021 ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 99, యూడీఎఫ్ కూటమి 41 సీట్లలో విజయం సాధించాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఒక్క సీటు కూడా గెలవకపోయినా 12.41 శాతం ఓట్లను తెచ్చుకోగలిగింది.
అధికార ఎల్డీఎఫ్కు అనూహ్యంగా ఈ ఎన్నికల్లో రెబల్స్ బెడద తీవ్రంగా ఉంది. గత వారం మాజీ మంత్రి, సీనియర్ సీపీఐ (ఎం) నేత జీ సుధాకరన్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తాను అలప్పుజాలోని అంబలప్పుజా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. అదే విధంగా సీపీఐ (ఎం) మాజీ ఎమ్మెల్యే పీకే శశిని పార్టీ బహిష్కరించింది. దీంతో అతడు పాలక్కాడ్‌లో రెబల్స్‌తో సమావేశం నిర్వహించారు. అతను కూడా ఈ ఎన్నికల్లో రెబల్‌గా దిగనున్నాడు. గతంలో ఎల్డీఎఫ్ మద్దతు పొందిన మాజీ ఎమ్మెల్యే పీవీ అనవ్ ఈసారి యూడీఎఫ్ మద్దతుతో రంగంలోకి దిగుతున్నాడు.
కాంగ్రెస్ ఎలాగైనా సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని పావులు కదుపుతున్నది. 2025లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 57 మున్సిపాల్టీలకు 17 మాత్రమే అధికార ఎల్డీఎఫ్ దక్కించుకోగా, 40 స్థానాల్లో యూడీఎఫ్ విజయం సాధించింది. నాలుగు కార్పొరేషన్లలో ఒక్కదాన్ని కూడా అధికార పార్టీ దక్కించుకోలేక పోయింది. అధికార పార్టీపై అసంతృప్తి తమకు లాభం చేకూరుస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నది. కాగా, ఇంత దగ్గరగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం పట్ల ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని కారణంగా అభ్యర్థులు ప్రచారం చేసుకునే సమయమే లేకుండా పోయిందని ఆయన చెప్పారు. నామినేషన్‌కు, ఓటింగ్ తేదీకి 10 రోజుల సమయం మాత్రమే ఉందని, ఇంత ఆదరాబాదరగా షెడ్యూల్ తయారు చేయాల్సిన అవసరమేముందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పోటీలో ఉన్న అస్సాం, పుదుచ్చేరి, కేరళలో తమ పార్టీకి సమయం లేకుండా ఈ రాష్ర్టాల్లో మొదటి విడతగా ఎన్నికలు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు.
అధికార ఎల్డీఎఫ్ కూటమిలో సీపీఐ (ఎం), సీపీఐ, కేరళ కాంగ్రెస్ (ఎం), జనతా దళ్ (సెక్యులర్) (జేడీ-ఎస్), నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), ఇండియన్ నేషనల్ లీగ్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి.
ఇక విపక్ష యూడీఎఫ్ కూటమిలో కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్), కేరళ కాంగ్రెస్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఉన్నాయి.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో బీజేపీ, భారత ధర్మ జన సేన (బీడీజేఎస్), ఏఐఏడీఎంకే, కేరళ కాంగ్రెస్ (కొన్ని వర్గాలు) ఉన్నాయి.