ముంబై, మార్చి 18 : డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజుకో రికార్డు స్థాయికి దిగజారుతున్నది. బుధవారం ఫారెక్స్ మార్కెట్లో మరోమారు ఆల్‌టైమ్ కనిష్ఠానికి దేశీయ కరెన్సీ వ్యాల్యూ క్షీణించింది. ఈ ఒక్కరోజే 49 పైసలు పడిపోయి మునుపెన్నడూ లేనివిధంగా 92.89 వద్దకు పతనమైంది. ఉదయం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్‌పై 92.42 దగ్గర మొదలైన రూపీ ట్రేడింగ్.. అంతకంతకూ బలహీనపడుతూ చివరకు 92.89 వద్ద ముగిసింది. మంగళవారం 92.40 దగ్గర స్థిరపడిన విషయం తెలిసిందే.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో ఎగబాకుతున్న ముడి చమురు ధరలు, భారతీయ దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరుగుతున్న డిమాండ్, దేశీయ మార్కెట్ నుంచి తరలిపోతున్న విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు.. రూపాయి ఉసురు తీస్తున్నాయని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా, నష్టపోతున్న రూపాయి మారకం విలువ.. భారత్‌లోకి దిగుమతయ్యే ప్రతి వస్తూత్పత్తి ధరను మరింత పెంచుతుందని ఆర్థిక విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం విదేశాల నుంచి వచ్చే దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో రూపాయి క్షీణత.. యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రమాదంలో పడేస్తున్నదని హెచ్చరిస్తున్నారు. మరిన్ని డాలర్లను చెల్లించి కావాల్సినవి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నదని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ద్రవ్యోల్బణం ఇంకా పెచ్చుమీరుతుందని అంటున్నారు. అదే జరిగితే జీడీపీ వృద్ధిరేటు, ఉద్యోగావకాశాలు, తయారీ, వినిమయ సామర్థ్యం, కొనుగోలు శక్తి, రుణ లభ్యత.. అన్నీ ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డాలర్ ముందు రూపీ ఏమాత్రం నిలబడలేకపోతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం అవసరమన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. రూపాయి మారకం విలువ.. ఆర్బీఐ పెట్టుకున్న 92.50 పరిమితిని కూడా దాటిపోయిందని అంటున్నారు. మార్కెట్లోకి డాలర్ల సరఫరాను పెంచి రూపాయిపై ఒత్తిడి తగ్గిస్తే కొంత ప్రయోజనం ఉండవచ్చని చెప్తున్నారు.